Indiramma houses for Chenchus: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో 70 ఏళ్లుగా నివాసం ఉంటున్న ఇండ్లు లేని నిరుపేద చెంచులు అయిన ఆదిమ గిరిజనులకు ఇందిరమ్మ ఇండ్లు ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఉట్నూర్ మండల కేంద్రంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌కు, ఐటీడీఏ పీవోకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ కార్యదర్శి సునారికారి రాజేశ్ మాట్లాడుతూ, కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఆదిమ గిరిజనలు అయిన చెంచులు 70 సంవత్సరాల నుంచి జీవిస్తున్నారని, వీరికి ఉండేందుకు గూడు, నీడ లేదని, నేటికీ డేరాలు వేసుకొని ఉంటున్నారని తెలిపారు.
ఇంత వరకు ఏ ప్రభుత్వం ఇండ్లు ఇవ్వలేదని, వీరికి స్వంత ఇల్లు కట్టుకొనే స్థోమత లేదని, వీళ్లు గతంలో వేట మీద ఆధారపడి బతుకు కొనసాగించే వారని, టైగర్ జోన్ వల్ల జీవన ఆధారం కోల్పోయారని చెప్పారు. పేపర్ డబ్బాలు ఎరుకొని బతుకుతున్నారని అన్నారు. వీళ్లకు పని ముట్లు లేవని, బతుకులు దినదిన గండంగా మారాయని, చెంచులమని చెబితే ఎవరూ పట్టించుకోవటం లేదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం చెంచులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ప్రభుత్వ పరంగా ఇందిరమ్మ ఇండ్లు అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పారని, ఐటీడీఏ పీవో చెంచుల సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారని తెలిపారు. కార్యక్రమంలో ఐఎఫ్‌టీయూ జిల్లా ఉపాధ్యక్షులు లింగన్న, అడ్వకేట్ నేదూరి జాకబ్, స్వచ్ఛంద సంస్థ కో-ఆర్డినేటర్ నేదురి లలిత కుమారి, చెంచులు శిరీష, చంద్రకళ, పూజిత, చంద్రకళ, చెంచులక్ష్మి పాల్గొన్నారు.