Ganesh immersion Shobha Yatra Nirmal 2025: గణపతి బప్పా మోరియా.. జై బోలో గణేష్ మహరాజ్ కి జై.. అంటూ నిర్మల్ పట్టణంలో గణేశుని శోభాయాత్ర అట్టహాసంగా ప్రారంభం అయింది. నిర్మల్ పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినాయకుని నిమజ్జన శోభాయాత్రను ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీలు రాజేష్ మీన, అవినాష్ కుమార్, అడిషనల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డిలతో కలిసి పూజలు చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భక్తిశ్రద్ధలతో నిమజ్జన శోభాయాత్రను కొనసాగించాలని కోరారు.
అన్నదానం
ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో గణపతి నిమజ్జన శోభాయాత్రను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని ఎస్పి జానకి షర్మిల ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల సిబ్బందితోపాటు నిర్మల్ పట్టణ పాత్రికేయులకు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ స్వయంగా ప్రతి ఒక్కరికి వడ్డించారు.
నిఘా నీడలో నిర్మల్
గణపతి నిమజ్జనాన్ని పురస్కరించుకొని నిర్మల్ పట్టణంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. నిర్మల్ పట్టణం అంతా నిఘా నీడలో ఉందని, ప్రతిక్షణం ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామన్నారు. పట్టణమంతా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు డ్రోన్ కెమెరాలతో పరిశీలిస్తున్నామని తెలిపారు. తనతో పాటు ఇద్దరు ఎస్పీలు, అడిషనల్ ఎస్పీ తో పాటు పెద్ద సంఖ్యలో సీఐలు ఎస్సైలు ఏఎస్ఐలు హెడ్ కానిస్టేబుళ్లు కానిస్టేబుళ్లు బందోబస్తులో ఉన్నారని, ప్రజలు సహకరించాలని కోరారు.
