- జర్నలిస్టుల పట్ల పాలకుల వివక్షను ప్రతిఘటిద్దాం
- సమస్యల పరిష్కారంలో జాప్యం తగదు
- దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలి
- జర్నలిస్టుల సమస్యలపై పోరాడే సంఘం టీడబ్ల్యూజేఎఫ్
Journalists Issues Telangana TWJF Mamidi Somayya: జర్నలిస్టు సంఘాలు అధికార పదవుల కోసం పాలక పక్షాలకు అమ్ముడుపోతున్నాయని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య మండిపడ్డారు. జర్నలిస్టు సంఘాలు జర్నలిస్టుల పక్షాన ఉండాలే తప్ప పాలక పక్షం ఉండరాదని సూచించారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా తృతీయ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిడి సోమయ్య మాట్లాడుతూ.. జర్నలిస్టుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని, ఈ వైఖరిని జర్నలిస్టులు సమష్టిగా ప్రతిఘటించాలని అన్నారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదన్నారు.
సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం కనీసం కొత్త అక్రిడిటేషన్ కార్డులు, హెల్త్‌కార్డులు ఇవ్వకుండా కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రెండు మూడు మాసాల్లో అన్ని జిల్లాల్లో ఫెడరేషన్ మహాసభలు పూర్తి చేసి పెద్ద ఎత్తున రాష్ట్ర మహాసభలకు సిద్ధమవ్వాలని కోరారు. సమావేశంలో ఐఎఫ్‌డబ్ల్యూజే జాతీయ కార్యదర్శి, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పులిపలుపుల ఆనందం, ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వల్లాల జగన్, రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్, జాతీయ కౌన్సిల్ సభ్యుడు, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడితాడు బాపురావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొలుమారి గోపాల్, పంతాటి రవీందర్, సీనియర్ జర్నలిస్టు ఎండీ సాదిక్, వరంగల్ జిల్లా అధ్యక్షుడు జక్కుల విజయ్ కుమార్, కార్యదర్శి బొట్ల స్వామిదాస్, భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు పర్కాల సమ్మయ్య గౌడ్, అడ్‌హక్ కమిటీ కన్వీనర్ రంజిత్, కో-కన్వీనర్ మురళీ తదితరులు పాల్గొని మాట్లాడారు.
భూపాలపల్లి జిల్లా టీడబ్ల్యూజేఎఫ్ నూతన కమిటీ ఎన్నిక
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) జయశంకర్ భూపాలపల్లి జిల్లా తృతీయ మహాసభ సందర్భంగా జిల్లా నూతన కమిటీ ఎన్నికైంది. జిల్లా అధ్యక్షుడుగా బండారి రాజు(హెచ్ ఎం టీవీ), ఉపాధ్యక్షులుగా కటకం రాజు(ఆంధ్రప్రభ), నాగుల సంతోష్(విజయక్రాంతి), తోట చంద్రశేఖర్(విజన్ ఆంధ్ర), కార్యదర్శి మార్క మురళీకృష్ణ
(మెట్రో ఈవెనింగ్), సహాయ కార్యదర్శి పిల్లి రామలింగం (సీ2 తెలంగాణ), బాసాని రాజబాబు (ఐన్యూస్), కోశాధికారి గుర్రపు రాజేందర్(మనం), కార్యవర్గ సభ్యులు మైదం మహేశ్, దేవేంద్ర చారి, సదాశివ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గైని రమేశ్ (వార్త), పెండ్యాల రంజిత్(వీ6), నేషనల్ కౌన్సిల్ సభ్యులు పర్కాల సమ్మయ్య తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.