- ప్రశాంతంగా వినాయక విగ్రహాల నిమజ్జనం
- రెండ్రోజుల పాటు సాగిన శోభాయాత్ర
డీజే సౌండ్‌తో దద్దరిల్లిన నిర్మల్ - నృత్యాలతో హోరెత్తించిన యువత
- అవాంచనీయ సంఘటనలు లేకుండా పూర్తి
- సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పటిష్ట నిఘా
- అధికారులు, సిబ్బందికి అభినందనలు : నిర్మల్ ఎస్పీ జి.జానకి షర్మిల
Ganesh Immersion Nirmal Peaceful Celebrations: నిర్మల్ జిల్లాలో గణేశ్ నిమజ్జనోత్సవాలు అత్యంత ఘనంగా ముగిసాయి. రెండ్రోజులపాటు శోభాయాత్ర కొనసాగింది. వివిధ వార్డుల్లో ప్రతిష్టించిన వినాయక విగ్రహాలను ఊరేగింపుగా తీసుకెళ్లి నిర్మల్ పట్టణంలోని వినాయక్ సాగర్ (బంగల్ పేట్ చెరువులో) నిమజ్జనం చేశారు. ఉత్సాహంగా సాగిన వేడుకల్లో డీజే సౌండ్ తో నిర్మల్ దద్దరిల్లింది. యువకుల నృత్యాలతో గణేశుడికి బైబై చెప్పారు. వెళ్లిరా వినాయక అంటూ పార్వతి తనయుడిని గంమ్మ ఒడికి సాగనంపారు.
పటిష్ట బందోబస్తు
నిర్మల్ జిల్లాలోని భైంసా, నిర్మల్ పట్టణాలతోపాటు అన్ని మండల కేంద్రాల్లో వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా విజయవంతంగా పూర్తయ్యిందని నిర్మల్ ఎస్సీ డాక్టర్ జానకి షర్మిల తెలిపారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా, సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జన శోభాయాత్రలు కొనసాగాయన్నారు. నిమజ్జన సమయంలో భద్రతా పరంగా ముందస్తు చర్యలు తీసుకున్నారు. సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో నిరంతరం పర్యవేక్షించామని తెలిపారు. శోభాయాత్రలో ఎలాంటి అంతరాయం లేకుండా పోలీసులు సమర్థవంతంగా విధులు నిర్వహించారని ప్రశంసించారు. క్షేత్ర స్థాయిలో శ్రమించి విధులు నిర్వర్తించిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు. సహకరించిన ప్రజలకు, మండప నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.