- పైలెట్ ప్రాజెక్టు కింద 21 పాఠశాలల్లో బోధన
- జాబితాపూర్ పాఠశాలలో ఏఐ ద్వారా బోధనను ప్రారంభించిన కలెక్టర్
AI Education: జగిత్యాల ప్రతినిధి, మార్చి 15 (మన బలగం): ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ కృత్రిమ మేధను వినియోగిస్తూ సులభతరంగా విద్యార్థులకు విద్యాబోధన అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ తెలిపారు. శనివారం జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో మండల పరిషత్ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటుచేసిన ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేధ)తో విద్యా బోధనను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు కంప్యూటర్లో చేస్తున్న తెలుగు, ఆంగ్లానికి సంబంధించిన ప్రమాణాలను పరిశీలించారు. గణితంలో సంఖ్యా భావాలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు బాగాహారాలు, తెలుగులో విద్యార్థులు చేస్తున్న ప్రమాణాలను కలెక్టర్ పరిశీలించి తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ప్రభుత్వ పాఠశాలలో విద్యా బోధన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద ఈరోజు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 21 ప్రభుత్వ పాఠశాలలో ఏఐ సహకారంతో వర్చువల్ రియాల్టీ విధానంలో పాఠాలు చెప్పేలా ప్రారంభించుకున్నామని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 3 నుంచి 5 తరగతి విద్యార్థులకు కనీస విద్య ప్రమాణాలు, అభ్యాసన సామర్థ్యాలను పెంచే లక్ష్యంగా ఏఐ ద్వారా బోధిస్తున్నట్లు తెలిపారు. దీనిపై ఆయా పాఠశాలల హెచ్ఎంలకు, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటికే ఆరు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టుగా కార్యక్రమాన్ని ప్రారంభించగా అక్కడ మంచి ఫలితాలు ఇచ్చినందున రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పాటు జగిత్యాల జిల్లాలో ఈరోజు నుంచి అమలు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, జిల్లా విద్యాశాఖ అధికారి రాము, అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.