Collector Abhilash Abhinav: నిర్మల్, నవంబర్ 7 (మన బలగం): సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను ఎటువంటి లోటుపాట్లు లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం లక్ష్మణచందా మండలం పీచర గ్రామంలో అధికారులు నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో భాగంగా గృహ జాబితా నమోదు ప్రక్రియ తీరును అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ తో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ అధికారి తమకు కేటాయించిన సర్వే విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. సమయానికి సర్వే నిర్వహించు ప్రదేశానికి చేరుకొని, నిర్ణీత సమయంలో సర్వేను పూర్తి చేయాలన్నారు. గ్రామంలోని ఎన్యూమరేషన్ బ్లాకు వివరాలు, సర్వే నిర్వహిస్తున్న ఎన్యూమరేటర్లు, తదితర వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. ఎన్యమూరేటర్లు ఓపికగా సర్వే లక్ష్యాలను ప్రజలకు వివరించి, వారి వివరాలు సరిగ్గా నమోదు చేసుకోవాలన్నారు. సర్వేలో భాగంగా చేపట్టే గృహ జాబితా నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలి
పీచార గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) కిషోర్ కుమార్‌తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియను అత్యంత పగడ్బందీగా నిర్వహించాలన్నారు. కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలను కల్పించాలన్నారు. ధాన్యపు బస్తాలను తూకం వేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. అన్ని రకాల రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని, రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు గాను వారి ఆధార్, బ్యాక్ పాస్ పుస్తకాల జిరాక్స్ కాపీలను తీసుకోవాలన్నారు. రైతులతో కలెక్టర్ మాట్లాడుతూ, ప్యాడి క్లీనింగ్ యంత్రాల ద్వారా వరి ధాన్యాన్ని శుభ్రపరచడం ద్వారా తరుగు రూపంలో నష్టం రాదన్నారు. వరి కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ఉన్నట్లయితే సహాయ కేంద్రానికి ఫోన్ ద్వారా సంప్రదించవచ్చునన్నారు. అదనపు ప్యాడీ క్లీనింగ్ యంత్రాల కోసం రైతులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేయగా, త్వరలోనే మరికొన్ని ప్యాడి క్లీనింగ్ యంత్రాలు సమకూరుస్తామని కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు.
పాఠశాల తనిఖీ
పీచర జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వండిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, రుచి చూశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. భోజనానికి నాణ్యమైన సరుకులు, కూరగాయలను మాత్రమే వినియోగించాలన్నారు. పాఠశాల ఆవరణలోని కిచెన్ షెడ్‌ని పరిశీలించి, కూరగాయలు, ఆకుకూరలను పెంచాలన్నారు. అనంతరం పొట్టపల్లి గ్రామంలోని వ్యవసాయ గోదామును కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గోదాంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలన్నారు. షిఫ్టులవారీగా సిబ్బంది విధులు నిర్వహిస్తూ, గోదాంకు వచ్చిన ధాన్యపు వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. రిజిస్టర్లను పరిశీలించి, ప్రతి రిజిస్టర్ ను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. కార్యక్రమాల్లో సీపీవో జీవరత్నం, డీఎం సివిల్ సప్లయిస్ వేణుగోపాల్, డీఎస్ఓ కిరణ్ కుమార్, జిల్లా వ్యవసాయాధికారి అంజి ప్రసాద్, తహసీల్దార్ జానకి, ఎంపీడీవో రాధ, ఎంపీవో అమీర్ ఖాన్, రైతులు, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.