Tarang 2025: నిర్మల్, మార్చ్ 1 (మన బలగం): విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి అమ్మానాన్నలకు మంచి గుర్తింపు తీసుకురావాలని జిల్లా విద్యాశాఖ అధికారి టి.రామారావు అన్నారు. నిర్మల్ జిల్లా కొండాపూర్‌లోని చంద్రశేఖర్ కన్వెన్షన్ హాల్‌లో చాణక్య హైస్కూల్ తరంగ్ 2025 వార్షికోత్సవం శనివారం మధ్యాహ్నం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఆయన మాట్లాడుతూ సరస్వతీ తల్లి కొలువుదిరిన జిల్లా నిర్మల్ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలపాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని అన్నారు. మండల విద్యాధికారి నాగేశ్వర్ రావు మాట్లాడుతూ.. విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రణాళికతో ముందుకెళ్లాలని సూచించారు. ప్రతి విద్యార్థి చిన్ననాటి నుంచి క్రమశిక్షణతో శ్రమిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చాణక్య హైస్కూల్ డైరెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా విద్యాధికారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి వి.వినోద్ కుమార్, జిల్లా పరీక్షల విభాగం ఇంచార్జ్ వి.భాను మూర్తి, పాఠశాల డైరెక్టర్లు సి.హెచ్ వెంకట్ రెడ్డి, టి.ప్రమోద్ రావు, ఏ.ప్రభాకర్, కే.శంకర్, పాఠశాల ప్రిన్సిపాల్ ఏ.హరీష్ కుమార్, జిల్లా ట్రాస్మా అధ్యక్షుడు పి.చంద్రా గౌడ్, వివిధ పాఠశాల ప్రధానో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.