Collector Abhilasha Abhinav: నిర్మల్, ఏప్రిల్ 8 (మన బలగం): రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సన్న బియ్యం ద్వారా నిరుపేదలకు ఎంతో లబ్ధి చేకూరుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు.
మంగళవారం ఖానాపూర్ మండలం తర్లపాడు గ్రామంలో సన్న బియ్యం లబ్ధిదారులు పల్లెర్ల సుజాత, రాజేశ్వర్ దంపతుల ఇంట్లో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్‌తో కలిసి కలెక్టర్ సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారు కుటుంబ సభ్యులతో కలెక్టర్ ముచటిస్తూ, వృత్తి, వారి పిల్లల చదువుకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానంలో నిలిచి తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలందరికీ నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్న సదుద్దేశంతో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. పల్లెర్ల సుజాత, రాజేశ్వర్ ఇంట్లో ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో తయారుచేసిన ఆహారాన్ని వారి కుటుంబ సభ్యులతో కలిసి తినడం ఆనందాన్ని కలిగించింది అన్నారు. సన్నబియ్యం నాణ్యత, రుచికి సంబంధించిన వివరాలను పలువురు లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలెవరు ప్రభుత్వం పంపిణీ చేసిన నాణ్యమైన బియ్యాన్ని దళారులకు అమ్మవద్దని సూచించారు. రేషన్ బియ్యం తినడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. అర్హులైన గ్రామస్తులంతా ప్రభుత్వం అందిస్తున్న పథకాలన్నింటికీ దరఖాస్తులు చేసుకోవాలన్నారు.
నిరుద్యోగ యువత రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోవాలని, సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో ఎంపీడీవో కార్యాలయంలో తమ దరఖాస్తులు సమర్పించాలన్నారు. మహిళా సంఘాల సభ్యులు రుణాలు పొంది స్వయం ఉపాధిని పొందాలన్నారు. ఇండ్లు లేని నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్లను దశలవారీగా మంజూరు చేస్తామన్నారు. సన్నబియ్యం లబ్ధిదారులు మాట్లాడుతూ, తమ ఇంటికి కలెక్టర్, అధికారులు భోజనానికి రావడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్బంగా కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు ఎస్సీ కాలనీలో పర్యటించిన కలెక్టర్ కాలనీ వాసుల సౌకర్యాలను, వారికి ఉన్న సమస్యల గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు సమస్యల వివరాలను కాలనీవాసులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరిస్తామని కాలనీ వాసులకు కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్నకళ్యాణి, ఖానాపూర్ తహసిల్దార్ సుజాత, ఎంపీడీవో సునీత, ఎంపీఓ రత్నాకర్, పంచాయతీ కార్యదర్శి రాజ్వనా, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
