Exhibition: నిర్మల్, డిసెంబర్ 28 (మన బలగం): జిల్లా కేంద్రంలో నిర్వహించే నుమాయిష్ (ఎగ్జిబిషన్)కు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నుమాయిష్ నిర్వహణపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్‌తో కలిసి ఆమె అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు మూడు రోజులపాటు ‘నిర్మల్ ఉత్సవాలు’ పేరుతో స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నుమాయిష్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించి జిల్లా శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. వ్యవసాయ, గ్రామీణ అభివృద్ధి, విద్య, పెయింటింగ్స్, హస్తకళలు, మహిళా స్వయం సంఘాల ఉత్పత్తుల స్టాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. అధికారులంతా సమన్వయంతో పనిచేసి నుమాయిష్ విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమం ప్రజలందరికీ తెలిసే విధంగా హోర్డింగ్స్ ఏర్పాటు చేసి, కరపత్రాలను పంచాలన్నారు.
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, కళాకారులతో సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. చరిత్రకారులతో జిల్లా చరిత్రను తెలిపే విధంగా కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. ఎగ్జిబిషన్ సందర్శనకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా తగు ఏర్పాట్లను చేయాలని తెలిపారు. ప్రజలను ఆకర్షించే విధంగా నుమాయిష్ పరిసర ప్రాంతాలను అందమైన లైటింగ్‌తో ముస్తాబు చేయాలని సూచించారు. ఆసక్తి ఉన్న ప్రజలు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న వస్తువులను ప్రదర్శించేందుకు అనుమతులకై https://docs.google.com/forms/d/1h5XUPVatFSTOHi0_ZjzkFWMRMZIynqxPQ_wXk8rcQog/edit ఆన్ లైన్ లింకు ద్వారా తమ పేరును నమోదు చేసుకోవచ్చునన్నారు. ఇతర వివరాల కోసం జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి చరవాణి నంబరు 9849913071ను సంప్రదించవచ్చని తెలిపారు. సమావేశంలో ఆర్డీవో రత్న కళ్యాణి, మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, డివైఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, డిఈఓ పి.రామారావు, డిఎస్ఓ కిరణ్ కుమార్, ఈడీఎం నదీమ్, డిఎమ్ హెచ్ఓ రాజేందర్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.