Inter exams: జగిత్యాల ప్రతినిధి, మార్చి 5 (మన బలగం): జగిత్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఇంటర్ మీడియట్ పరీక్షా కేంద్రాలను మొదటి రోజే జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ పరిశీలించి అక్కడి ఏర్పాట్లపై అరాతీశారు. పట్టణంలోని ఆల్ఫోర్స్ జూనియర్ కాలేజ్, ఎస్‌కేఎన్ఆర్, ఉమెన్స్ కళాశాల, శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ, ఎన్ఎస్పీ జూనియర్ కాలేజీలో జరుగుతున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల సెంటర్లను పరిశీలించారు. జిల్లాలో మొత్తం విద్యార్థులు 14,450 మంది ఇంటర్ పరీక్షలు రాస్తున్నారని, వీరి కోసం 28 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో భారతీయ న్యాయ సంహిత యాక్ట్ (144) సెక్షన్ అమలు ఉంటుందని తెలిపారు. ఒక నిమిషం ఆలస్యం అనే నిబంధనను తాజాగా 5 నిమిషాలు సడలిస్తూ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతత వాతావరణంలో జరుగుతున్నాయని ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కలెక్టర్ వెంట, ఇంటర్మీడియట్ అధికారి నారాయణ, ఎమ్మార్వో రామ్ మోహన్ పాల్గొన్నారు.