MLA Rama Rao Patel: ముధోల్, నవంబర్ 11 (మన బలగం): గతంలో ముధోల్‌కు మహాత్మా జ్యోతిబాఫూలే జూనియర్ కళాశాల హాస్టల్ మంజూరు కాగా సౌకర్యాలు లేవన్న సాకుతో గత పాలకుల నిర్లక్ష్యంతో నిర్మల్ జిల్లా కేంద్రానికి తరలించారు. ఇటీవల మహాత్మా జ్యోతిబాఫూలే హాస్టల్‌ను ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ తనిఖీ చేశారు. దీంతో ఇక్కడ ఉండాల్సిన జూనియర్ కళాశాలను నిర్మల్‌కు తరలించారని స్థానిక నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. వెంటనే స్పందించిన ఆయన మహాత్మా జ్యోతిబాఫూలే బాలికల జూనియర్ కళాశాలకు అవసరమైన ఏర్పాట్లను వెంటనే చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అయితే స్థానిక మహాత్మా జ్యోతిబాఫూలే పాఠశాల హాస్టల్ పక్కన ప్రైవేటు భవనాన్ని అద్దెకు ఇచ్చే విధంగా భవన యజమానిని ఒప్పించారు. ఏర్పాట్లను స్థానిక నాయకులు దగ్గర ఉండి పర్యవేక్షించారు. దీంతో ఎట్టకేలకు ముధోల్‌లో మహాత్మా జ్యోతిబాఫూలే జూనియర్ కళాశాలను సోమవారం ప్రారంభించారు. ముధోల్‌కు మళ్లీ జూనియర్ కళాశాల హాస్టల్ ఏర్పాటు కావటంతో స్థానికులు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు.