Telangana Liberation Day Nirmal: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణను నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కలిగించిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను స్మరించుకున్నారు. ఎంతోమంది యోధుల పోరాటంతో నిజాం, రజాకార్ల నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందని, అందుకే బీజేపీ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తోందని అన్నారు. నిజాం పాలన నుంచి విముక్తి లభిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన నిర్వహిస్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే సెప్టెంబర్ 17న అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, నాయకులు రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, సత్యనారాయణ గౌడ్, మల్లికార్జున్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయితోపాటు తాజా మాజీ కౌన్సిలర్లు, పట్టణ బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.