Etala Rajender
Etala Rajender

Etala Rajender: లగిచెర్ల అరెస్టులను ఖండించిన ఈటల

Etala Rajender: లగిచెర్లలో అరెస్టులను ఖండిస్తున్నట్లు ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న ఆయన మంగళవారం మీడియా ప్రకటన విడుదల చేశారు. ఫార్మా కంపెనీలకు అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు కానీ ప్రభుత్వం మధ్యలో బ్రోకర్ లాగా వ్యవహరించాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్‌కు ఓట్లు వేసింది బ్రోకర్ గిరి చేయడానికి, మధ్యవర్తిత్వం చేయడానికి కాదని చురకలంటించారు. ‘‘వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల గ్రామంలో ఫార్మాసిటీ కోసం భూములు సేకరించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనిని అక్కడ రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. మా భూములు గుంజుకోకండి, మా ఉపాధి మీద దెబ్బకొట్టకండి అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినకుండా ఫార్మా కంపెనీలకు రైతుల భూములను అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనిని వ్యతిరేకిస్తూ ధర్నాలు చేశారు, నిరసనలు తెలిపారు. గ్రామసభలను బహిష్కరించారు. స్వయంగా ఎంపీ డీకే అరుణ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. అయినప్పటికీ వారి మాట పెడచెవిన పెట్టి ప్రభుత్వం భూసేకరణ కోసం సమావేశం ఏర్పాటు చేసింది. దీనితో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిని అడ్డం పెట్టుకొని కొడంగల్ చుట్టుపక్కల మండలాల్లో ఇంటర్నెట్, కరెంటు బంద్ చేసి వందల మంది పోలీసులు గ్రామాల్లో మోహరించి అరెస్టు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అక్రమ కేసులు పెడితే మంచిది కాదని హెచ్చరిస్తున్నాం. గతంలో ముచ్చర్లలో ఫార్మసిటీ కోసం 8 లక్షలకు భూములు సేకరించి కోటి రెండు కోట్లకు ఫార్మా కంపెనీలకు అప్పజెప్పే ప్రయత్నం చేసినాడు ఇదే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. బీజేపీగా మేము కూడా వ్యతిరేకించాము. అప్పుడు వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు భూములు గుంజుకుని రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వపరమైన భూములు ఇవ్వండి కానీ ప్రైవేటు వ్యక్తుల భూములు ఇవ్వొద్దని డిమాండ్ చేస్తున్నాను. రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉద్యోగ కల్పన చేస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పటివరకు భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు పూర్తి నష్టపరిహారం ఇవ్వలేదు. ఇచ్చిన హామీలు అమలు కాలేదు. ఫార్మా కంపెనీలకు అవసరమైతే వారే భూసేకరణ చేసుకుంటారు కానీ ప్రభుత్వం మధ్యలో బ్రోకర్ లాగా వ్యవహరించాల్సిన అవసరం లేదు. ఫార్మాసిటీ పేరుతో ప్రభుత్వం దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. అక్రమ అరెస్టులను ఆపాలి. ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుదాం. మేమంతా మీకు అండగా ఉంటామని హామీ ఇస్తున్నాము.’’ అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *