Timely Medical Care for Pregnant Women – Nirmal District Collector Abhilash Abhinav: ప్రసూతి ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు సకాలంలో సరైన వైద్యం అందించి ఆదుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ మాత, శిశు ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా మహిళా శక్తి క్యాంటీన్‌ను పరిశీలించిన కలెక్టర్, భోజనం నాణ్యత, పరిశుభ్రతపై వివరాలు సేకరించారు. అనంతరం లాబొరేటరీ, స్కానింగ్ కేంద్రం, ఇన్‌వార్డు, అవుట్‌వార్డు, ఆపరేషన్ థియేటర్, ఓపి వార్డు, బాలింతల వార్డులను సందర్శించి రోగుల పరిస్థితి, అందిస్తున్న వైద్యసేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వైద్యులకు పలు సూచనలు చేస్తూ గర్భిణులకు, బాలింతలకు ప్రత్యేక వైద్య సేవలు సమయానికి అందించాలన్నారు.
ప్రసవాల సమయంలో ఎటువంటి నిర్లక్ష్యం చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రోగులతో మృదువుగా, శ్రద్ధగా వ్యవహరించి, అవసరమైన మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణం శుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతిరోజూ పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ స్పష్టం చేశారు. వైద్యులు, సిబ్బంది తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి రోగుల విశ్వాసాన్ని నిలబెట్టాలని కలెక్టర్ సూచించారు.ఈ తనిఖీలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, ఆసుపత్రి పర్యవేక్షకులు సరోజ, వైద్యులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
