Additional Collector Faizan Ahmed: నిర్మల్, జనవరి 27 (మన బలగం): నిర్మల్ పురపాలక ప్రత్యేక అధికారిగా సోమవారం జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ బాధ్యతలు స్వీకరించారు. నిర్మల్ మున్సిపల్ ప్రతినిధుల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పైజాన్ అహ్మద్ మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా బాధ్యతగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో ఆయన మాట్లాడుతూ, నిర్మల్ మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు సహకరించాలన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి, నిర్మల్ మున్సిపాలిటీను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. సమయానికి అన్ని రకాల పన్నుల వసూలును పూర్తి చేయాలని అన్నారు. నిర్మల్ మున్సిపాలిటీకి ప్రగతికి సంబంధించి నివేదికలను ఎప్పటికప్పుడు తమకు అందజేయాలని తెలిపారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ హరిభువన్, పట్టణ ప్రణాళిక అధికారి హరీశ్, ఆర్వో అనూఫ్, మెప్మా పీడీ సుభాష్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.