Survey of Indiramma houses: నిర్మల్, డిసెంబర్ 19 (మన బలగం): ఇందిరమ్మ ఇళ్ళ సర్వేను పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని భాగ్యనగర్‌లో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వే ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. సర్వేయర్లు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్న తీరును పరిశీలించారు. మొబైల్ యాప్‌లో నమోదు చేసిన వివరాలు దరఖాస్తుదారుల వాస్తవ వివరాలతో సరిపోయాయా లేదా అన్నది గమనించి, అధికారులకు పలు సూచనలు చేశారు. సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, దరఖాస్తుదారుల స్థితిగతులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలిస్తూ, పూర్తి సమాచారాన్ని సేకరించి మొబైల్ యాప్‌లో పొందుపరచాలని తెలిపారు. దరఖాస్తుదారులు ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి ఫొటోతో పాటు వారి ఫొటోను, స్వంత ఇల్లు అయితే నిర్ధారిత డాక్యుమెంట్లు కానీ, ఇంటి పన్ను చెల్లించిన రసీదులను యాప్‌లో అప్లోడ్ చేయాలని తెలిపారు. సొంత ఇల్లు నిర్మించుకునేందుకు దరఖాస్తుదారు చూపిన స్థలం, దాని డాక్యుమెంట్లను యాప్‌లో పొందుపర్చాలని సూచించారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ఈ నెలాఖరులోగా సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖమర్ అహ్మద్, తహసీల్దార్ రాజు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.