Heavy rains alert Nirmal district Collector Abhilash Abhinav: జిల్లాలో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వచ్చే మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లే పరిస్థితుల్లో వాటిని దాటే ప్రయత్నం చేయరాదని కలెక్టర్ సూచించారు. తక్కువ ఎత్తులోని ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్థానిక తహసీల్దార్, ఎంఆర్ఓ, ఎంపీడీఓలకు సమాచారం ఇవ్వాలని, జిల్లా కంట్రోల్ రూమ్ నంబర్ 9100577132 ద్వారా సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు. ఇప్పటికే జిల్లా యంత్రాంగం అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని అప్రమత్తంగా ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు.