Annual police sports: జగిత్యాల ప్రతినిధి, జనవరి 16 (మన బలగం): క్రీడలతో శారీరక, మానసికొల్లాసలం ఏర్పడడం, శారీరక దృఢత్వం పెరగడం, స్నేహభావం పెంపొందడం వంటి ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. విధుల్లో పని ఓత్తిడిలో ఉండే జిల్లా పోలీసులకు ఆటవిడుపుగా జిల్లా పోలీసు వార్షిక క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గురువారం ఉదయం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానంలో జిల్లా ఎస్పీ పాల్గొని జిల్లా వార్షిక పోలీసు క్రీడలను ప్రారంభించి క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొదటగా క్రీడా పోటీలలో పాల్గొననున్న క్రీడాకారులందరికీ అభినందనలు తెలిపారు. క్రీడలు ఆడే స్ఫూర్తి గొప్పదని, ప్రతి ఒక్కరూ క్రీడలను ఆడుతూ మానసిక, శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని అన్నారు. ఇలాంటి క్రీడా పోటీల్లోనే ప్రతి ఒక్కరి ప్రతిభ కనబడుతుందని అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని కోరారు. ప్రతిరోజూ విధులు నిర్వహించే అధికారులకు, సిబ్బందికి ఆటవిడుపుగా ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహిస్తారని, వాటిలో ప్రతి ఒక్కరూ పాల్గొని మానసిక ఉల్లాసాన్ని పొందాలని అన్నారు. ఇలాంటి క్రీడా పోటీల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగుల మధ్య సఖ్యత పెరిగి, విధుల్లో కలిసిమెలిసి పనిచేస్తారని తెలిపారు. తదుపరి రన్నింగ్, వాలీబాల్ క్రికెట్ క్రీడలను ఎస్పీ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ముఖ్యంగా ఈ క్రీడలు రెండు రోజులపాటు జరుగుతాయని అందులో వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, బ్యాట్మెంటన్, అథ్లెటిక్స్, క్యారం, చెస్ లాంటి వివిధ అంశాలలో ఈ క్రీడలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీమ్ రావు, డీఎస్పీలు రఘుచందర్, రాములు, రంగా రెడ్డి, ఏవో శశికళ, డీసీఆర్‌బీఐటీ కోర్ ఇన్‌స్పె్క్టర్లు శ్రీనివాస్, ఆరీఫ్ అలీ ఖాన్, రఫీ ఖాన్, సీఐలు రాం నరసింహారెడ్డి, వేణుగోపాల్, రవి, కృష్ణారెడ్డి, నిరంజన్ రెడ్డి, సురేశ్, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు కిరణ్ కుమార్, రామకృష్ణ, వేణు, ఎస్.ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
