- ఎమ్మెల్యే నివాసానికి రాక
- కన్నీటి పర్యంతమైన యాత్రికులు
- భోజనం ఏర్పాట్లు చేసి, ఓదార్చిన ఎమ్మెల్యే
Bhainsa Pilgrims: ముధోల్, జనవరి 16 (మన బలగం): ఉత్తరప్రదేశ్‌లోని బృందావన్‌లో భైంసాకు చెందిన యాత్రికుల బస్సు అగ్నికి ఆహుతి కాగా, శీలం దుర్పతి అనే వృద్ధుడు సజీవ దహనం కాగా అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన యాత్రికులను భైంసాకు రప్పించడానికి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అక్కడి ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాట్లు చేయించారు. దారి ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం ద్వారా ఒక్కొక్కరికి రూ.1500 ఇప్పించారు. రెండు వాహనాల్లో యాత్రికులు గురువారం సాయంత్రం సురక్షితంగా భైంసాకు చేరుకున్నారు. భైంసాలోని ఎమ్మెల్యే నివాసానికి యాత్రికులు వచ్చి ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయ్యారు. ఒకరిని కోల్పోయామని, తమకు పెద్ద ప్రమాదం తప్పిందని బోరున విలిపించారు. ఎమ్మెల్యే వారిని ఓదార్చారు. తానున్నానంటూ భరోసా కల్పించారు. యాత్రికుల, కుటుంబసభ్యులు, బంధువులతో ఎమ్మెల్యే నివాసం జనసందోహంగా మారింది. శీలం దుర్పతి భార్య ఎల్లవ్వ తన భర్తను కోల్పోయి కన్నీరు పెట్టడం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేసింది. ఎమ్మెల్యే రామారావు పటేల్ అక్కున చేర్చుకొని ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని అందరిని పలకరించారు. అక్కడే భోజన ఏర్పాట్లు చేయించి యాత్రికులకు వడ్డన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు యాత్రికులు కృతజ్ఞతలు చెప్పారు. అక్కడి ప్రభుత్వం తమకు అన్ని విధాలుగా ఆదుకుందని, జిల్లా కలెక్టర్, ఎస్పీ, అక్కడి ప్రాంత ప్రజా ప్రతినిధులు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సభ్యులు, తమ వద్దకు వచ్చి భోజన ఏర్పాట్లతోపాటు, ఉండేందుకు వసతి కల్పించారన్నారు. దుర్పతి అంత్యక్రియలు ముగియగానే తమకు వాహనాలు ఏర్పాటుచేసి ఆర్థిక సాయం చేశారన్నారు. ప్రమాదం నుంచి గట్టెక్కామని, ఒకవేళ బస్సులో అందరూ ఉంటే తమ ప్రాణాలు పోయేవని కన్నీటి పర్యంతమయ్యారు.