- విద్యుత్ లైన్లను గమనించండి
- సంక్రాంతిని సంతోషంగా జరుపుకోండి
- జగిత్యాల ఎస్ఈ సాలియా నాయక్
Fly kites in plain area: జగిత్యాల, జనవరి 7 (మన బలగం): సంక్రాతి పండుగ వేళ పిల్లలు, పెద్దలు పతంగులు ఎగురవేయడం ఒక సాంప్రదాయమని, సురక్షిత ప్రాంతాల్లో, మైదానాల్లో పతంగులు ఎగురవేయడమే శ్రేయస్కరమని, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్ల వద్ద పతంగులు ఎగురవేసే సమయాల్లో జాగ్రత్తలు పాటించాలని జగిత్యాల విద్యుత్ ఎస్ఈ సాలియా నాయక్ కోరారు. మంగళవారం ప్రకటన విడుదల చేసారు. పతంగుల మాంజాలు విద్యుత్ లైన్లపై, ట్రాన్సఫార్మర్లపై పడి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. విద్యుత్ లైన్లు లేని బహిరంగ ప్రదేశాల్లోనే ఎగరవేసి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ఖాళీ ప్రదేశాల్లో, విద్యుత్ లైన్లు, ట్రాన్స్ ఫార్మర్లకు దూరంగా మైదానాల్లో మాత్రమే పతంగులు ఎగురవేయాలన్నారు. విద్యుత్ లైన్ల వద్ద, ట్రాన్సఫార్మర్లు, సబ్‌స్టేషన్ల వద్ద ఎగురవేయడం అత్యంత ప్రమాదకరమన్నారు. ఒక వేళ పతంగులు కానీ, మాంజాలు కానీ విద్యుత్ లైన్లపై, ఇతర విద్యుత్ పరికరాలపై పడితే విద్యుత్ సరఫరాలో అంతరాయంతో పాటు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. దారాలతో ఉన్న పతంగులే తప్ప చైనా మాంజాలతో కూడిన వాటిని అస్సలే వాడొద్దన్నారు.
మాంజా దారంతో ప్రమాదం పొంచి ఉన్నదని, కరెంటు తీగలకు తాకితే తెగవని, పైగా లైన్లు బ్రేక్ డౌన్ అయ్యే అవకాశముందని తెలిపారు. మాంజా దారాలతో పక్షులతో పాటు మనుషులకు గాయాలు అయ్యే ప్రమాదం ఉందన్నారు. గాలిపటం ఎగురవేస్తూ కరెంటు తీగలకు చుట్టుకుంటే దాన్ని లాగడం, కర్ర సహాయంతో లేదా ఇనుప పైపులాంటి వాటితో తొలగించే ప్రయత్నం ఎట్టి పరిస్థితిల్లో చేయరాదన్నారు. పతంగులు కానీ, మాంజాలు కానీ విద్యుత్ లైన్లపై, ఇతర విద్యుత్ పరికరాలపై పడ్డప్పుడు వాటిని వదిలేయాలని సూచించారు. ఒక వేళ వాటిని పట్టుకు లాగినప్పుడు విద్యుత్ తీగలు ఒక దానికొకటి రాసుకుని విద్యుత్ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందన్నారు. బాల్కని, గోడలు, ప్రహరీ గోడలేని మేడపై పతంగులు ఎగురవేయరాదని, ఇది ప్రమాదకరమని సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు పతంగులు ఎగురవేసేటప్పుడు తప్పకుండా గమనిస్తూ ఉండాలని కోరారు. పిల్లలు తెగిన, కింద పడ్డ విద్యుత్ వైర్లను తాకనివ్వొద్దని కోరారు. ఒక వేళ విద్యుత్ వైర్లపై, విద్యుత్ పరికరాలపై పతంగులు, మాంజాలు తెగి పడ్డట్లు ఉంటే, విద్యుత్ వైర్లు తెగి రోడ్డుపై పడ్డట్టు ఉన్నా, వాటిని తాకకుండా వెంటనే విద్యుత్ శాఖ వారి 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు, లేదా సమీప విద్యుత్ కార్యాలయానికి తెలియజేయాలని కోరారు. జాగ్రత్తలతో పతంగులు ఎగరవేయాలని విద్యుత్ శాఖకు సహకరించాలని కోరారు. వినియోగదారుల శ్రేయస్సు కోసం ఆహర్నిశలు విద్యుత్ శాఖ నిబద్దతతో పనిచేస్తుందని ఎస్ఈ పేర్కొన్నారు.