CPI: కరీంనగర్, నవంబర్ 10 (మన బలగం): సీపీఐది త్యాగాలు చేసిన చరిత్ర అని, స్వతంత్ర్యానికి ముందు, తర్వాత చేసిన త్యాగాల ఫలితంగా 2025 డిసెంబర్ 26 నాటికి 100 ఏళ్లు పార్టీ చేరుకున్నదని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వెంకటస్వామి తెలిపారు. శంకరపట్నం మండలం కేశవపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీపీఐ ఏడాది పాటు సంస్థాగత నిర్మాణం సభ్యత్వం నమోదు సెమినార్లు, సదస్సులు, సైకిల్ ర్యాలీలు గ్రామ గ్రామాన ఎర్రజెండా ఎగరవేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఉచిత బస్సు, గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రైతులకు సగం రుణమాఫీ చేసిందని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి, వృద్ధులు, వికలాంగులకు, వితంతువులకు పెంచుతామన్న పెన్షన్ పెంచకపోవడంతో ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని పేర్కొన్నారు.
తొమ్మిదిన్నరా ఏళ్ల బీఆర్ఎస్ నిరంకుశ పాలన చూసిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటికీ అధికారులపై పట్టు సాధించలేదని తెలిపారు. ఇంకా కొంతమంది అధికారులు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సైద్ధాంతికంగా కాంగ్రెస్ పార్టీకి స్నేహపూర్వక మద్దతు ఇచ్చామని, ఆ మద్దతు కొనసాగుతుందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని, ఇంటి స్థలం లేకుంటే ఇంటి స్థలం కొనుగోలు చేసి నిర్మాణం చేపట్టాలని సూచించారు. బీఆర్ఎస్ పాలనలో వివిధ శాఖలలో చేసిన అప్పులను ప్రజలకు తెలిసేందుకు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య, తాడవేణి రవి, పిట్టల రామస్వామి, పిట్టల తిరుపతి, కోలని తిరుపతి, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.