Nirmal Collector Alerts on Heavy Rains and Flood Safety Measures
Nirmal Collector Alerts on Heavy Rains and Flood Safety Measures

Nirmal Collector Alerts on Heavy Rains and Flood Safety Measures: మీకు అండగా మేమున్నాం.. ప్రజలు ఆందోళన చెందవద్దు

  • ఎలాంటి సమస్య వచ్చినా కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వండి
  • జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

Nirmal Collector Alerts on Heavy Rains and Flood Safety Measures: నిర్మల్, ఆగస్టు 28 (మన బలగం): భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 24 గంటలు మీకు అందుబాటులో ఉంటామని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మీకు ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. తక్కువ సమయంలో భారీ వర్షాలు కురవడం వల్ల వరదలు వస్తున్నాయని, ప్రజలు ఎవరు బయటకి రావద్దని కోరారు.

ప్రభావిత ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన

జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో నిర్మల్ పట్టణంలోని పలు వరద ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గురువారం పరిశీలించారు. శాంతినగర్ చౌరస్తా, సోఫీనగర్, తిరుమల టాకీస్ పరిసరాల్లో పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్, స్థానికులతో మాట్లాడారు. ప్రజలు ఎటువంటి ఆందోళన చెందనవసరం లేదని, అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్నారని తెలిపారు. వర్షాల కారణంగా ఇబ్బందులు తలెత్తితే వెంటనే కలెక్టర్ కంట్రోల్ రూమ్ నెంబర్‌ 9100577132కి సమాచారం ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, తహసీల్దార్ రాజు, తదితరులు పాల్గొన్నారు.

ప్రాజెక్టులకు వరద పోటు

నిర్మల్ జిల్లాలోని కడెం, స్వర్ణ, గడ్డన్న వాగు ప్రాజెక్టులకు ఎగువ నుంచి వరద తీవ్రంగా వస్తుందని కలెక్టర్ తెలిపారు. దీంతో అధికారులు అప్రమత్తమై ప్రాజెక్టుల గేట్లను ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారని అన్నారు. తద్వారా గోదావరికి వరద ప్రవాహం అధికంగా పెరిగిందని, ప్రజలు ఎవరు గోదావరి, వాగులు, కుంటలు, చెరువుల వైపు వెళ్లకూడదని సూచించారు.

చేపల వేటకు వెళ్లకూడదు

భారీ వర్షాలు నేపథ్యంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని కలెక్టర్ అభిలాష అభినవ్ కోరారు. ప్రాజెక్టుల్లో, వాగుల్లో నీటి ప్రవాహం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో చేపల వేటకు వెళ్లడం ప్రమాదకరమని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *