AIKS Farmers Meeting Nirmal Adilabad: నిర్మల్, ఆగస్టు 20 (మన బలగం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని అఖిలభారత ఐక్య రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ అన్నారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం, ఉమ్మడి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ప్రథమ మహాసభను ఖానాపూర్ మండలంలోని (కట్ల గంగన్న నగర్) అడవి సారంగాపూర్ గ్రామంలో నిర్వహించారు. ముందుగా ఏఐయూకేఎస్ సంఘం అరుణపతాకాన్ని ఉమ్మడి జిల్లా అధ్యక్షులు నంది రామయ్య ఆవిష్కరించారు. అనంతరం మహాసభ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అంకుశ్ రావ్ అధ్యక్షతన సభను నిర్వహించారు.
సభ ప్రారంభానికి ముందు అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వి.ప్రభాకర్ మాట్లాడుతూ.. అఖిల భారత ఐక్య రైతు సంఘం గత యాభై సంవత్సరాల క్రితమే ఏర్పడిందని, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం పేరుతో ఉండి ఎన్నో రైతాంగ ఉద్యమాల్లో చురుగ్గా పనిచేసిందని గుర్తు చేశారు. ఈ రైతు సంఘం నాటి భూస్వాముల, పెత్తందారుల అరాచకాలకు వ్యతిరేకంగా ఉవ్వెత్తున ఉద్యమం సాగించిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని, రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధరను కేటాయించే పరిస్థితిలో లేదని, అంతా దళారీల రాజ్యమే నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు పంటలకు పెట్టుబడిపై 50 శాతం అదనంగా ధరను నిర్ణయించి రైతులకు ఇవ్వాలని ఆయన అన్నారు.
మరియు కేంద్ర ప్రభుత్వం అటవీ భూములను బడా కార్పొరేట్ శక్తులకు అప్పనంగా కట్టబెట్టే ప్రయత్నం చేస్తుందని రైతులంతా ఐక్యంగా ఉండి కేంద్ర ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపు నిచ్చారు. మరియు సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ పార్టీ నిర్మల్ జిల్లా కార్యదర్శి కట్ల రాజన్న మాట్లాడుతూ.. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు అయినప్పటికీ మన దేశం ఇంకా దారిద్ర్య రేఖకు దిగువున ఉండటం సిగ్గుచేటని, దేశం ఈ పరిస్థితికి రావడానికి కారణం దేశంలోని పాలకుల అవినీతి, అక్రమాలే ముఖ్యకారణమని అన్నారు. రైతులందరూ ఐక్యంగా ఉండి పోరాడితేనే తమ బతుకులు మారతాయని తెలిపారు. కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం నాయకులు మడావి అంకుష్ రావ్, జక్కుల రాజన్న, అడ్డకట్ట శంకర్, కుంచపు ఎల్లయ్య, గోరేభాయ్, సుదర్శన్, మహేంధర్, చాంద్ పాషా, కుర్మ రాజన్న, మచ్చ శ్రీనివాస్, భీమ్ రావ్, లింగు, గోనే లచ్చన్న, సంజీవ్, రాజేశ్వర్ మరియు రైతులు పాల్గొన్నారు.
