- ప్రభుత్వ విప్, శాసనసభ్యులు ఆది శ్రీనివాస్
- గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేసేందుకు చర్యలు
- పోలీస్ స్పోర్ట్స్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, కలెక్టర్
Police Sports Festival: మనబలగం, కరీంనగర్ బ్యూరో: మంచి భద్రతతో కూడిన ప్రశాంత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడంలో పోలీసు శాఖ పాత్ర ఎనలేనిదని, ఇటువంటి పోలీసు శాఖకు క్రీడా పోటీల నిర్వహణ ద్వారా వారి ఒత్తిడి కొంత తగ్గుతుందని ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. 2036 ఒలంపిక్స్ నాటికి తెలంగాణ నుంచి పతకాలు సాధించాలని ఉద్దేశ్యంతో ప్రభుత్వం క్రీడా జ్యోతి పాలసీ తయారు చేస్తుందని పేర్కొన్నారు. బుధవారం సిరిసిల్లలోని అంబేడ్కర్ స్టేడియంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న రెండో పోలీస్ వార్షిక క్రీడా సంబురాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాబోయే బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా మహిళలకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. క్రీడా పోటీల నిర్వహణతో మానసిక ఉల్లాసంతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలతో స్నేహభావం పెరగడానికి ఉపయోగపడుతుందని అన్నారు. క్రీడలు అంటే ప్రత్యేక ఆసక్తితో వాలీబాల్ పోటీలలో పాల్గొని మంచి బహుమతుల సైతం తాను సాధించానని ప్రభుత్వ విప్ తెలిపారు. యువత కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ తదితర అన్ని రకాల క్రీడల వైపు ఆసక్తి చూపించాలని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ప్రతినిత్యం శాంతిభద్రతల పరిరక్షణ కోసం కృషి చేసే పోలీసు అధికారులు, సిబ్బందికి ఇటువంటి క్రీడా పోటీలు ఒత్తిడిని తగ్గిస్తాయని అన్నారు.
క్రీడా పోటీల నిర్వహణతో పోలీసు అధికారులు రెట్టించిన ఉత్సాహంతో విధులు నిర్వహిస్తారని అన్నారు. గ్రామీణ ప్రజలకు సైతం ఏదైనా ఇబ్బందులు ఎదురైతే డయల్ 100కు ఫోన్ చేస్తే సహాయం అందుతుందనే విశ్వాసం కలిగిందని అన్నారు. పోలీసు శాఖలో సాంకేతికత వినియోగం పెంచేందుకు ఎస్పీ ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నామని, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం మరింత మెరుగ్గా అమలు చేయాలని అన్నారు. యువత సన్మార్గంలో నడిచేందుకు గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేసేందుకు ముఖ్యమంత్రి రూపొందించిన ప్రణాళికలను పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని కోరారు. మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిన వ్యక్తులను కౌన్సెలింగ్ ద్వారా మార్చే దిశగా చర్యలు తీసుకోవాలని అన్నారు. గచ్చిబౌలి స్టేడియంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. సీసీ కెమెరాల ద్వారా శాంతి భద్రతలను మరింత పటిష్టం చేస్తున్నామని, వేములవాడ పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ, సిరిసిల్ల జిల్లాలో ఎస్పీ మంచి కార్యక్రమం తీసుకున్నారని, కుటుంబాలకు దూరంగా ఒత్తిడితో పని చేసే పోలీసు శాఖ అధికారులకు సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారని అన్నారు.
మనమంతా ప్రశాంతంగా జీవించాలంటే పోలీసు శాఖ పనితీరు చాలా ముఖ్యమని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో పోలీసు శాఖకు పూర్తి స్వేచ్ఛ కల్పించామని అన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ పోలీస్ శాఖ క్రీడా పోటీలు నిర్వహించడం చాలా మంచి కార్యక్రమం అని, 24 గంటలపాటు అలర్ట్‌గా ఉంటూ విధులు నిర్వహించే పోలీస్ శాఖకు ఇటువంటి క్రీడా పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. క్రీడా పోటీలలో పాల్గొన్న సిబ్బంది అందరికీ ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇటీవలే మానేరు వాగులో ఆత్మహత్యకు ప్రయత్నించిన వృద్ధురాలని కాపాడిన కానిస్టేబుల్‌ను అభినందిస్తూ సర్టిఫికెట్, క్యాష్ ప్రైజ్ అందజేసి సత్కరించారు. అనంతరం క్రీడా పోటీలలో విజేతలకు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ లతో కలసి ట్రోఫీ అందజేశారు. కార్యక్రమంలో వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సి.ఐ లు, ఆర్.ఐ.లు, ఎస్.ఐ లు, ఆర్.ఎస్.ఐ.లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
