- సొమ్మసిల్లినా సొమ్ములు వసూలు కావాల్సిందే..
- నిర్మల్ జిల్లాలో 14 మైక్రో ఫైనాన్స్‌ల ఆగడాలు
- వేలల్లో గ్రూపులు.. కోట్లలో రుణాలు
- ఉదయం 6 గంటలకే ఇళ్ల ముంగిట ఉద్యోగులు
- ఆందోళనలో బాధితులు.. పెరిగిపోతున్న వేధింపులు
- సొమ్మసిల్లి పడిపోయిన మహిళ
Micro Finance: నిర్మల్, నవంబర్ 19 (మన బలగం): డబ్బులు తీసుకున్నప్పుడు కిస్తీల ప్రకారం చెల్లించాలి.. అందలేదు.. కుదరలేదు అంటే నడవదు.. మీకు ఆరోగ్యం బాగా లేకున్నా మాకు అవసరం లేదు.. తీసుకున్న డబ్బులు చెల్లించాలి.. లేదంటే కుదరదు.. ఇస్తారా.. చస్తారా మీరే నిర్ణయించుకోండి.. కిస్తీ ఆగితే మీ ఇళ్ల ముందు వచ్చి కూర్చుంటాం.. డబ్బులు ఇచ్చే వరకు ఇక్కడి నుంచి కదలం.. మీ ఇష్టం ఉన్న చోట చెప్పుకోండి.. మాకేం భయం లేదు.. మాకు డబ్బులు చెల్లిస్తేనే ఇక్కడి నుంచి కదిలేది.. అంటూ మైక్రో ఫైనాన్స్ సిబ్బంది రుణాలు తీసుకున్న వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్ ప్రాంతంలో మైక్రోఫైనాన్స్ సిబ్బంది వేధింపులకు పాల్పడ్డారు. వేధింపులను తట్టుకోలేక ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది. అక్కడే ఉన్న తోటి మహిళలు నీళ్లు చల్లి ఆమెను లేపారు. మహిళ సొమ్మసిల్లి పడిపోయినా మైక్రో సిబ్బంది అక్కడే ఉండి అవన్నీ తమకేం సంబంధం లేదు, తమకు డబ్బులు చెల్లించాలని వేధించడం కనిపించింది.
నిర్మల్ కేంద్రంగా 14 మైక్రో ఫైనాన్స్ కంపెనీలు
నిర్మల్ జిల్లా కేంద్రంగా 14 మైక్రో ఫైనాన్స్ కంపెనీలు తమ ఆర్థిక లావాదేవీలను కొనసాగిస్తున్నాయి. జిల్లా కేంద్రం నుంచి 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాల్లోని మహిళలకు రుణాలను అందిస్తున్నారు. 6 నుంచి 15 మంది మహిళలను ఒక గ్రూపుగా చేసి రూ.45 వేల వరకు రుణాలను అందిస్తున్నారు. ఈ రుణాలను చెల్లించేందుకు వారం రోజులు, 15 రోజులు, నెలరోజుల వ్యవధిలో వివిధ ఫైనాన్స్ కంపెనీలు కిస్తీలను నిర్ణయిస్తున్నాయి. వాయిదాల ప్రకారం డబ్బులను చెల్లించాలి. లేనిపక్షంలో వారి వేధింపులు చెప్పనలవి కాదు.
వేలల్లో గ్రూపులు.. కోట్లలో రుణాలు
నిర్మల్ జిల్లాలో మైక్రో ఫైనాన్స్ ఆగడాలు మితిమీరి పోయాయి. వేలల్లో గ్రూపులను ఏర్పాటు చేసి వందల కోట్ల రూపాయల రుణాలను పంపిణీ చేశారు. నిర్మల్ పట్టణంతోపాటు 30 కిలోమీటర్ల పరిధిలోని ప్రతి పల్లెలో గ్రూపులను ఏర్పాటు చేసి మైక్రో రుణాలను అందజేశారు. ఈ మైక్రో ఉచ్చులో చిక్కుకున్న బాధితులు రుణాలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజల ఆర్థిక అవసరాలను ఆసరాగా తీసుకొని మైక్రో ఫైనాన్స్‌లు రుణాలను అందజేస్తున్నారు. సకాలంలో చెల్లించని వారిని మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. దీంతో అనేకమంది ఆత్మహత్యలకు పాల్పడ్డ సంఘటనలు జిల్లాలో అనేకంగా ఉన్నాయి.
ఉదయం 6 గంటలకే ఇళ్ల ముందుకు
ఉదయం 6 గంటలకు మైక్రో ఫైనాన్స్ సిబ్బంది ఇళ్ల ముందు వాలిపోతున్నారు. వాయిదాల ప్రకారం డబ్బులు చెల్లించే వరకు ఇళ్ల ముందు నుంచి కదలడం లేదు. రుణాలు తీసుకున్న బాధితులను సైతం ఎక్కడికి పోకుండా అడ్డుకుంటున్నారు. డబ్బులు చెల్లిస్తే తప్ప కదిలేది లేదని హెచ్చరిస్తున్నారు. గ్రూపులోని సభ్యులందరి డబ్బులు వస్తేనే తీసుకుంటామని, ఒక్కరి డబ్బులు తక్కువగా వచ్చిన వినేది లేదని తెగేసి చెబుతున్నారు. మిగతా సభ్యులంతా తలా కొంత పోగేసి తమకు పూర్తి డబ్బులు చెల్లించాలని లేనిపక్షంలో ఇక్కడి నుంచి కదిలేది లేదని హెచ్చరిస్తున్నారు.
సిబిల్ స్కోర్ తగ్గిస్తాం.. పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తాం..
తీసుకున్న రుణాలను వాయిదాల ప్రకారం చెల్లించకపోతే మీ సిబిల్ స్కోర్‌ను పూర్తిగా తగ్గిస్తామని, మీ పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఉన్న ఆస్తులు అమ్ముకొని అయినా తమకు సకాలంలో డబ్బులు చెల్లించాలని మొండికేస్తున్నారు. ఉరి పెట్టుకోండి మాకేం బాధ లేదు మా డబ్బులు మాకు చెల్లించండి అంటూ తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు. భవిష్యత్తులో మీకు ఎలాంటి బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీంతో మైక్రోఫైనాన్స్ సిబ్బంది వేధింపులకు బాధితులు ఆందోళనకు గురవుతున్నారు.
ప్రజలను వేధిస్తే చర్యలు తప్పవు: నిర్మల్ పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్
రుణాల వసూళ్ల పేరిట ప్రజలను వేధింపులకు గురి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నిర్మల్ పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం సోఫీ నగర్‌లో మైక్రో ఫైనాన్స్ సిబ్బంది వేధింపుల విషయమై వివరణ కోరగా పై విధంగా స్పందించారు. మైక్రో ఫైనాన్స్, ప్రైవేట్ ఫైనాన్స్‌ల పేరిట ప్రజలను వేధింపులకు గురిచేసిన వారిని వదిలిపెట్టబోమని, త్వరలోనే ఎస్పీ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.