- సీఎం కప్ పోటీలు ప్రారంభం
- ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా 2కే రన్
CM Cup: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: క్రీడలు మానసిక ఉల్లాసానికి, దేహదారుఢ్యానికి దోహద పడతాయని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పేర్కొన్నారు. ప్రజా పాలన ఏడాది అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు సీఎం కప్ పోటీల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం 2కే రన్ పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ నుంచి బతుకమ్మ ఘాట్ దాకా 2కే రన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అధికారులు విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా పాలన విజయోత్సవాల వేడుకలను ప్రభుత్వం పండగ వాతావరణం లో ఘనంగా నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా సిరిసిల్ల జిల్లాలో 2 కే రన్ నిర్వహించామని అన్నారు. 2కే రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులను, యువతను కలెక్టర్ అభినందించారు. విద్యార్థులు, యువత చదువుతోపాటు, ప్రతి రోజూ కొంత సమయాన్ని క్రీడలకు కేటాయించాలని పిలుపు నిచ్చారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తీసుకువచ్చేందుకు, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేలా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని తెలిపారు. క్రీడాకారులు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో డీ.ఈ.ఓ. రమేష్ కుమార్, డీ.వై.ఎస్.ఓ. రాందాస్, సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ లావణ్య, పీ.డీలు, పీ.ఈ.టీ.లు, వాలీ బాల్ అకాడమీ క్రీడాకారులు,యువతీ యువకులు , ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు, మహిళలు పాల్గొన్నారు.