పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ అభిలాష అభినవ్
Group-3 Examinations: నిర్మల్, నవంబర్ 18 (మన బలగం): తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్-3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా, కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ సాఫీగా పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. సోమవారం జరిగిన పరీక్షకు జిల్లాలో మొత్తం 8,124 మంది అభ్యర్థులకు గాను, 4,665 మంది హాజరు కాగా, 3,459 మంది గైర్హాజరు అయ్యారని వివరించారు. 57.42 శాతం హాజరు నమోదైందని తెలిపారు. కలెక్టర్ వెంట రీజినల్ కో-ఆర్డినేటర్ పీజీ రెడ్డి, డిపార్ట్‌మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, పట్టణ తహసీల్దార్ రాజు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
