- డిసెంబర్లోగా రికార్డుల పరిశీలన, సర్వే పూర్తి చేయండి
- జనవరి తొలివారంలో నివేదిక ఇవ్వండి
- సెపీ అధికారులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశం
- తెలంగాణలోని ఎనిమీ ప్రాపర్టీస్ కేంద్ర, రాష్ట్ర అధికారులతో కేంద్ర మంత్రి సమీక్ష
- ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశం
Bandi Sanjay: మనబలగం, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కస్టోడియన్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా(సెపీ) సంరక్షణలో ఉన్న శత్రు ఆస్తుల (ఎనిమీ ప్రాపర్టీ) లెక్క తేల్చాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని హైదరాబాద్, రంగారెడ్డి, కొత్తగూడెం, వికారాబాద్ జిల్లాల్లో శత్రు ఆస్తుల వివరాల విచారణను వచ్చే నెలాఖరు నాటికి పూర్తి చేసి, జనవరి మొదటి వారంలో నివేదిక ఇవ్వాలని కోరారు. గురువారం ఉదయం హైదరాబాద్లోని హోటల్ మారియట్లో ఎనిమీ ప్రాపర్టీకి సంబంధించి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సెపీ ముంబై విభాగ అధికారులతో పాటు రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, సీసీఎల్ఏ నవీన్ మిట్టల్, హోంశాఖ సహాయ మంత్రి వ్యక్తిగత కార్యదర్శి అండ్ర వంశీ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, హైదరాబాద్, సికింద్రాబాద్, వికారాబాద్ రెవిన్యూ డివిజనల్ అధికారులు హాజరయ్యారు. 1962లో చైనీస్ దండయాత్ర,1965 నుండి 1971 వరకు జరిగిన ఇండో-పాక్ యుద్దం అనంతరం భారత్ నుంచి వెళ్లిపోయి పాకిస్తాన్, చైనాలో స్థిరపడి ఆయా దేశాల పౌరసత్వం తీసుకున్న వ్యక్తులకు సంబంధించి భారత్లో ఉన్న ఆస్తులను శత్రు(ఎనిమీ ప్రాపర్టీ) ఆస్తులుగా ప్రభుత్వం గుర్తించింది. వీటి సంరక్షణ బాధ్యతలను కస్టోడియన్ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా(సెపీ)కు అప్పగించింది.
తెలంగాణ, ఏపీతోపాటు దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాల్లో, 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో దాదాపు 13 వేల వరకు శత్రు ఆస్తులున్నట్లు కేంద్రం వద్ద రికార్డులున్నాయి. వీటి మార్కెట్ విలువ వేల కోట్లు ఉన్నట్లు గుర్తించింది. ఎనిమీ ప్రాపర్టీ చట్టంలోని సెక్షన్ 8(ఏ) ప్రకారం ఈ ఆస్తులను విక్రియంచే అధికారం కేంద్రానికి ఉంది. అయితే నాటి నుంచి నేటి వరకు ఈ ఆస్తులు చాలా చోట్ల అన్యాక్రాంతమయ్యాయి. మరికొన్ని ఆస్తులకు సంబంధించి న్యాయ వివాదాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణలోని ఎనిమీ ఆస్తుల వివరాలపై దాదాపు 2 గంటలపాటు ప్రత్యేకంగా సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా 234 శత్రు ఆస్తులన్నాయని పేర్కొన్న అధికారులు రంగారెడ్డిలో 180, హైదరాబాద్లో 44, కొత్తగూడెంలో 7, వికారాబాద్లో 3 శత్రు ఆస్తులున్నాయని వివరించారు. వీటిలో మెజారిటీ స్థలాలు అక్రమణలకు గురయ్యాయని, నిర్మాణాలు కూడా ఉన్నాయని తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు సంబంధించి మియాపూర్, కొత్వాల్ గూడ లో, హైదరాబాద్ చిక్కడపల్లి, ముషీరాబాద్తోపాటు పాతబస్తీలోనూ విలువైన ఆస్తులు అన్యాక్రాంతమైనట్లు అధికారులు వివరించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ తక్షణమే ఆయా ఆస్తుల రికార్డుల పరిశీలన, సర్వే నిర్వహణకు సెపీ ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున రికార్డుల పరిశీలన, సర్వే నిర్వహణ కోసం ప్రత్యేకంగా బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. వీరిద్దరి ఆద్వర్యంలో జాయింట్ కమిటీగా ఏర్పాటై డిసెంబర్ నెలాఖరులోగటా రికార్డుల పరిశీలనతోపాటు సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. జనవరి తొలివారానికల్లా తెలంగాణలోని ఎనిమీ ఆస్తుల వివరాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. ఆ నివేదిక ఆధారంగా శత్రు ఆస్తులపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.