TG RTC: నిర్మల్, జులై 5 (మన బలగం): ఆర్టీసీ నిర్మల్ డిపో నుంచి ఆధ్యాత్మిక క్షేత్రాలైన కానిపాకమ్, అరుణాచలం, పలని, పాతాళషెంబు, మధుర మీనాక్షి, రామేశ్వరం, శ్రీరంగం, భద్రాచలం, అన్నవరం, శ్రీశైలం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపోమేనేజర్ కె.పండరి తెలిపారు. ఈ నెల 10న గురుపౌర్ణిమ ఉన్నందున అరుణాచలం గిరిప్రదక్షిణ కోసం నిర్మల్ నుంచి 9వ తేదీ మధ్యాహ్నం ఒంటి గంటకు అరుణాచలం బస్సు బయలుదేరుతుందని తెలిపారు. ఈ బస్సు 9వ తేదీన నిర్మల్ నుంచి బయలుదేరి 10 తేదీ ఉదయం 7 గంటలకు కానిపాకం చేరుకుంటుందని, వరాహసిద్ధివినాయక దర్శనం అనంతరం వెల్లూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం సాయంత్రం అరుణాచలం చేరుకుంటుంది. అక్కడ అరుణాచలేశ్వరుని దర్శనం, గిరిప్రదక్షిణ ముగించుకొని మరుసటి రోజు బయలు దేరి గద్వాల్ జిల్లా అలంపూర్ జోగులాంబను దర్శించుకొని నిర్మల్ చేరుకుంటుందని తెలిపారు. ఛార్జి ఒకరికి రూ.4900 ఉంటుందని మేనేజర్ తెలిపారు. భోజన వసతి ఖర్చులు ప్రయాణికులే పెట్టుకోవాలని సూచించారు.
మరొక బస్సు 16 జులై రోజు నిర్మల్ నుంచి బయలుదేరి కానిపాకం, అరుణాచలం, పలని, పాదాలషెంబు కరంగిల్ మాల, మధుర మీనాక్షి, రామేశ్వరం, శ్రీరంగం రంగనాయ విష్ణు మూర్తి దర్శనం చేసుకొని 21 తేదీ సాయంత్రం నిర్మల్ చేరుకుంటుందని ఆయన తెలిపారు. ఈ ప్యాకేజ్ ఒకరికి రూ.7500 ఉంటుందని భోజన, వసతి ఖర్చులు ప్రయాణికులే భరించాలని తెలిపారు. అలాగే 9 జులై రోజు రాత్రి 8 గంటలకు శ్రీశైలం నడుపుతున్నామని, నిర్మల్ నుంచి రాత్రి 8 గంటలకు బయలుదేరి ఉదయం శ్రీశైలం చేరుకొని దర్శనం చేసుకొని సాయంత్రం శ్రీశైలం నుంచి బయలుదేరి తెల్లవారుజామున నిర్మల్ చేరుకుంటుందని ఛార్జి ఒకరికి రూ.2250లు ఉంటుందని తెలిపారు. ఇవి కాకుండా వీటి తర్వాత భద్రాచలం, అన్నవరం, ప్రయాగ్ రాజ్, అయోధ్య, కాశీ, మొదలగు పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతామని, ప్రయాణికులు ఈ సదవకాశాన్ని సద్వినియోగ పరచుకొని మీ మొబైల్‌లో కానీ మా రిజర్వేషన్ కౌంటర్‌లో కానీ ముందస్తుగా టికెట్ బుక్ చేసుకోవాలని సూచించారు.