vanamahotsavam nirmal: నిర్మల్, జులై 5 (మన బలగం): పర్యావరణ పరిరక్షణ బాధ్యత మనందరిదని, మొక్కలు నాటి పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. వనమహోత్సవం కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించేందుకు శనివారం నిర్మల్ పట్టణంలోని దివ్యనగర్ పార్కులో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాలల విద్యార్థులు, మహిళలు, కాలనీ వాసులతో కలిసి జిల్లా కలెక్టర్, స్థానిక సంస్థల అదనపు జిల్లా కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటడమే కాదు, వాటిని సంరక్షించడంలో చొరవ చూపాలని పేర్కొన్నారు.
మొక్కల సంరక్షణ కోసం ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని, క్రమం తప్పకుండా నీరు పోయాలని, అవసరమైన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం భాగ్యనగర్, శాంతినగర్ ప్రాంతాల్లోని పార్కులను కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. ఉపయోగించని పార్కులను అభివృద్ధి చేసి పచ్చదనాన్ని పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి పి.రామారావు, నిర్మల్ మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, భైంసా మున్సిపల్ కమిషనర్ రాజేశ్ కుమార్, మెప్మా పీడీ సుభాష్, దివ్యనగర్ కాలనీ గౌరవాధ్యక్షులు కె.రామ్ కిషన్ రెడ్డి, అధ్యక్ష, కార్యదర్శులు పురస్తు శంకర్, గడుదాస్ రమేశ్, కోశాధికారి నరేందర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వంగ రవీందర్ రెడ్డి, సుధార్ సింగ్, కిష్టయ్య, విద్యార్థులు, ఉపాధ్యాయులు, మున్సిపల్ కార్మికులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
