Mid-Day Meal Scheme workers demand solutions in Khanapur meeting: నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో గురువారం మధ్యాహ్న భోజనం కార్మికుల 2వ మహాసభలు సీఎం రావ్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేశ్, మధ్యాహ్న భోజన పథకం యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సులోచన మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు పెరుగుతున్న ధరలకు అనుకూలంగా మెనూ చార్జీలు పెంచాలని, మధ్యాహ్న భోజనం పాఠశాలలకు అన్ని రకాల వస్తువులు ప్రభుత్వమే ఇస్తూ కార్మికులకు నెలకు పదివేల రూపాయలు జీతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. యూనిఫామ్, ఐడీ కార్డ్స్ సౌకర్యం కల్పించాలని, 60 సంవత్సరాలు పైబడిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.2 లక్షలు ఇవ్వాలని, పెండింగ్‌లో ఉన్న జీతాలు, బిల్లులు విడుదల వెంటనే చేయాలని పేర్కొన్నారు. పది నెలల కోడిగుడ్ల బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది, మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు ప్రైవేటు స్వచ్ఛంద సంస్థ అప్పజెప్పే పని ఆలోచన విరమించుకోవాలని, మధ్యాహ్న భోజనం మెనూ చార్జీలు, కోడిగుడ్డు, ఉప్పు, నూనె ధరలు పెంచవలసిన అవసరం ఉండని తెలిపారు.
కేరళ, తమిళనాడు రాష్ట్రంలో మధ్యాహ్న భోజనానికి అన్ని రకాల వస్తువులు సరిపడా చేస్తూ, నెలకు పదివేల రూపాయలు జీతం రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయని అన్నారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికుల క్షేమం కోరడం ఉత్తమాటేనని ఇలాగే కొనసాగితే ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టడం ఖాయమని ఎద్దేవచేశారు. పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దీనికి గాను ఒక్కో విద్యార్థికి యూనిట్ ఖర్చు రోజుకు రూ.15గా నిర్ణయించడం వలన నిర్వహణ భారంగా మారిందన్నారు. సమస్యలు పరిస్కారం చేయకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో మధ్యాహ్న భోజన కమిటీ జిల్లా గౌరవ అధ్యక్షులు గంగామణి, జిల్లా అధ్యక్షులుగా బొడ్డు గోదావరి, నాయకులు బి.లక్ష్మి, సత్యవ్వ, గంగాధర్, రాధా, రేణుక, రాజవ్వ, లక్ష్మి, రాజేశ్వర్, వందన తదితరులు పాల్గొన్నారు.
యూనియన్ నూతన జిల్లా కమిటీ ఎన్నిక
తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మిక యూనియన్ నూతన కమిటీ ఎన్నుకున్నారు. 19 మందితో జిల్లా కమిటీ ఎన్నికైంది. జిల్లా గౌరవ అధ్యక్షులు గంగామణి, జిల్లా అధ్యక్షులుగా బొడ్డు గోదావరి, జిల్లా ఉపాధ్యక్షులుగా బి.లక్ష్మి, సత్యవ్వ, గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాధా, జిల్లా సహాయ కార్యదర్శులుగా రేణుక, రాజవ్వ, లక్ష్మి, రాజేశ్వర్, కోశాధికారిగా వందనలను ఎన్నుకున్నారు.

