Buffaloes Rescued from Godavari Floods: వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు లక్ష్మణచాంద మండలం మునిపెల్లి, మాచాపూర్ గ్రామాలకు చెందిన సుమారు 300 బర్రెలు గోదావరి మధ్యలోని కుర్రులో చిక్కుకున్నాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహించడంతో పశువులు బయటకు వెళ్లలేక కుర్రులోనే ఉండిపోయాయి. సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కుర్రులో 300 బర్రెలు వారం రోజులుగా ఉండిపోయాయి. సోమవారం గోదావరి శాంతించడంతో కొందరు గ్రామస్తులు ధైర్యం చేసి కుర్రుకు వెళ్లి బర్రెలను గోదావరి దాటించారు. దీంతో మాచాపూర, మునిపెల్లి గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇరు గ్రామాల నుంచి వరదల్లో చిక్కుకున్న పశువులు ఇండ్లకు చేరుకోగా మరికొందరి పశువులు రాలేదు. వరదల్లో కొన్ని పశువులు కొట్టుకుపోయాయని, అవి ఎవరివో తెలియాల్సి ఉందని ఆయా గ్రామాల ప్రజలు తెలిపారు. వారం రోజులు గోదావరి మధ్యలో చిక్కుకున్న పశువులు క్షేమంగా ఇండ్లకు చేరుకోవడం పట్ల పశువుల యజమానులు ఆనందం వ్యక్తం చేశారు.
