- పండరిపురం లాగానే రోజు ప్రత్యేక పూజలు
- సంవత్సరానికి ఒకసారి జాతర మహోత్సవం
- 500 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన ఆలయం
- ప్రారంభమైన తాళ సప్తమి వేడుకలు
- కొనసాగుతున్న జాతర వేడుకలు
Kubhir Vithaleswara Temple: కుభీర్, నవంబర్ 24 (మన బలగం): మహారాష్ట్రలోని పవిత్ర పుణ్యక్షేత్రమైన పండరీపురం ఆలయానికి ఎంత విశిష్ట, ఎంత చరిత్ర ఉందో అంతే చరిత్ర, అంత విశిష్టత నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో ఉన్న శ్రీ విఠలేశ్వర ఆలయానికి ఉంది. ఇక్కడ కొలువైన విఠలరుక్మయి ఇక్కడి కుబేరుడి గా వెలుగొందుతున్నాడు. ఇక్కడి ప్రజలు ఆరాధ్య దైవంగా కొలుస్తారు. పండరీపురం లాగానే ఇక్కడ ప్రతిరోజు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. పండరీపురం లో ఉన్న గర్భగుడి లాగే ఇక్కడి గర్భగుడి ఉంటుంది. ఈ గర్భగుడిని రాత్రికి రాత్రే నిర్మించారు అని పురాణం తెలుపుతుంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ప్రతి సంవత్సరం శ్రీ విఠలేశ్వర జాతర నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఏడు రోజుల పాటు జాతర కొనసాగుతుంది. ఈ ఏడు రోజులు తాళ సత్తా వేడుకలు జరుగుతాయి. గ్రామంలోని ప్రతి ఒక్కరూ తాళ సప్తమి లో పాల్గొంటారు.
ఇలా ఏడు రోజులపాటు కొనసాగుతూ జాతర ముగింపు రోజు శ్రీ విఠలరుక్ముయి లను ప్రత్యేక రథంలో గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బాజాభజంత్రీలతో కన్నుల పండువగా అత్యంత వైభవంగా శోభాయాత్ర నిర్వహిస్తూ గ్రామంలోని ప్రతి ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సత్ పంక్తి భోజనాలు నిర్వహిస్తారు. మండల ప్రజలతో పాటు ఇతర మండలాల ప్రజలు భారీ సంఖ్యలో వస్తుంటారు అదే విధంగా మహారాష్ట్రలోని పలు గ్రామాలకు చెందిన విఠలేశ్వర భక్తులు హాజరవుతారు. ఇక్కడి విఠలేశ్వర ని దర్శించుకుంటే సాక్షాత్తు పండరీపురం లోని విఠలేశ్వరన్ని దర్శించుకున్నట్లు గా భక్తుల అపార నమ్మకం కార్తీక మాసంలో ఇక్కడ ప్రతిరోజు కాకడ హారతి కొనసాగుతుంది. ఈ హారతి కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. భక్తుల కొంగు బంగారమైన శ్రీ విఠలరుక్ముయి దర్శనానికి ప్రతిరోజు ఎక్కడెక్కడినుండో భక్తులు వస్తుంటారు. పక్షం రోజులకు ఒకసారి చేసే ఏకాదశి వ్రతాలను తొలి ఏకాదశి పర్వదినం నుంచి ప్రారంభిస్తారు. ఈరోజు నుంచే ఉపవాస దీక్షలు మొదలుపెడతారు. ఈ కార్యక్రమానికి గ్రామంలోని ప్రతి ఇంటి వారు పాల్గొనడం విశేషం. ఇక్కడ జరిగే ఉట్ల పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఓ చిన్నారికి కృష్ణ వేషధారణ చేసి ఉట్టిని కొట్టిస్తారు. అప్పుడు ఆలయ ప్రాంగణం భక్తితో కిటకిటలాడుతూ రేపల్లెను తలపిస్తుంది.
శ్రీ విఠలరుక్ముయి సమక్షంలో పెళ్లిళ్లు
మండల కేంద్రమైన కుభీర్‌తో పాటు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు శ్రీ విఠలరుక్ముయి కొలువై ఉన్న శ్రీ విఠలేశ్వర ఆలయంలో పెళ్లిళ్లు చేస్తూ ఉంటారు. సుమారు ప్రతిరోజు ఒకటి నుంచి నాలుగు పెళ్లిళ్లు వరకు జరుగుతాయి. ఇక్కడ పెళ్లి చేస్తే ఆ జంట ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు పిల్లల పాపలతో సుఖంగా జీవిస్తారని ఇక్కడ ప్రజల అపార నమ్మకం.. మండలంలో ఏ పెళ్లి జరిగిన మొదటి పెళ్లి కార్డు ఈ ఆలయంలోని విఠల రుక్కుమ్మాయి పాదాల వద్ద ఉంచడం ఇక్కడ ఆనవాయితీగా వస్తోంది. ఇక్కడ పెళ్లిళ్లు చేయడానికి ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తుంది.
ఉట్ల పండుగకు ఓ ప్రత్యేకత
కార్తీక పౌర్ణమి మరుసటి రోజు ఈ ఆలయంలో జరిగే ఉట్ల పండుగ కు ఇక్కడ ఓ ప్రత్యేకత ఉంది. ఉట్లా పండుగకు గ్రామంలోని ప్రతి ఒక్కరూ హాజరై ఉట్ల పండుగను ఎంతో వైభవంగా కన్నుల పండువగా జరుపుకుంటారు. ఇలా జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీగా కొనసాగుతూ వస్తుంది.
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం: ఆలయ కమిటీ అధ్యక్షులు పెంటాజి
ఏడు రోజుల పాటు కొనసాగే జాతరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. తాళ సప్తమి వేడుకలు కొనసాగుతున్నాయి చివరి రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సుమారు రెండు లక్షల మంది భక్తులు హాజరు కావచ్చని, భక్తులకు తగ్గట్టు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.