- గంభీరావుపేటలో ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
- లింగన్నపేట నుంచి కోరుట్లపేట వరకు రోడ్డు
- గంభీరావుపేట నుంచి మల్లారెడ్డిపేట వరకు బ్రిడ్జి
Bandi Sanjay: మనబలగం, సిరిసిల్ల ప్రతినిధి: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో రూ.23 కోట్ల కేంద్ర నిధులతో ఆదివారం అభివృద్ధి పనులను శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా లింగన్నపేట నుండి కోరుట్లపేట వరకు నిర్మించిన రోడ్డును బండి సంజయ్ ప్రారంభించారు. అట్లాగే గంభీరావుపేట నుంచి మల్లారెడ్డిపేటకు వెళ్లే దారిలో రూ.8.30 కోట్ల కేంద్ర నిధులతో నూతనంగా నిర్మించిన బ్రిడ్జిని సైతం కేంద్ర మంత్రి ప్రారంభించారు. గంభీరావుపేటలోని ఎల్లమ్మ దేవాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. ‘గతంలో గంభీరావుపేట ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు లింగన్నపేట నుండి కోరుట్లపేట వరకు రూ.15 కోట్ల వ్యయంతో రోడ్డును నిర్మించాం. గంభీరావుపేట నుంచి మల్లారెడ్డిపేట వరకు రూ.8.30 కోట్ల వ్యయంతో నూతనంగా బ్రిడ్జిని నిర్మించాం. ఈరోజు వాటిని ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది.
గతంలోనూ కేంద్ర ప్రభుత్వం సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధికి ఎన్నో నిధులిచ్చింది. రాజకీయ వైషమ్యాలతో గత ప్రభుత్వం కుట్రలు చేసింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ తోవలో నడుస్తోంది. రాజకీయ వైషమ్యాలు సృష్టించి అభివృద్ధి జరగకుండా చేస్తోంది. కేంద్రంతో వైరం పెట్టుకుంటోంది. పేరు ప్రఖ్యాతుల కోసం మొండి పట్టుకు పోయి షో పొలిటిక్స్ చేస్తోంది. ఇది మంచి పద్ధతి కాదు. మహారాష్ట్ర ప్రజలు వాస్తవాలు గమనించారు. కాంగ్రెస్‌ను ఓడించి బీజేపీకి పట్టం కట్టారు. అక్కడ వార్ వన్ సైడ్ అయ్యింది. జార్ఖండ్‌లో టఫ్ ఫైట్ నడుస్తోంది. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ మెజారిటీ సీట్లు సాధించింది. ప్రధానమంత్రి నరేంద్రమోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు ఆమోదం తెలిపారు. ప్రతి ఒక్క పార్టీ రాజకీయ వైషమ్యాలను పక్కనపెట్టి తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరుతున్నా.’ అని అన్నారు.