SP Jagityala
SP Jagityala

SP Jagityala: స్టేషన్‌కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలి.. జగిత్యాల ఎస్పీ

  • గ్రామాల్లో విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి సారించాలి
  • మేడిపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ

SP Jagityala: జగిత్యాల, అక్టోబర్ 10 (మన బలగం): పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరు ఉండాలని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అన్నారు. గురువారం వార్షిక పోలీస్ స్టేషన్ల తనిఖీల్లో భాగంగా మేడిపెల్లి పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు చేరువ అయ్యేలా పోలీస్ విధులు ఉండాలని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందిస్తూ బాధితులకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా కల్పించాలని, బాధితులకు ఏదైనా సమస్య ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్‌లో సంప్రదించవచ్చని తెలిపారు. గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

పోలీస్ స్టేషన్‌లో పెట్రోల్ కార్, బ్లూ కోట్ సిబ్బంది సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలు దూరంగా ఉన్నప్పటికీ 10 నిమిషాల్లో చేరుకునే విధంగా పని చేస్తున్నారని తెలిపారు. పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది పనితీరు బాగుందని అభినందించారు.ఈ సందర్భంగా పెండింగ్‌లో ఉన్న కేసుల గురించి, పెండింగ్ ఉన్న కేసులపై రివ్యూ చేశారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల నమోదు, శాంతిభద్రతల పరిరక్షణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో 5ఎస్ అమలు చేసిన తీరును, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది డ్యూటీల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రిసెప్షన్ వర్టికల్ నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుళ్లను పిటిషన్ మేనేజ్‌మెంట్లో ఎంట్రీ చేసిన డేటాను తనిఖీ చేశారు.

రిసెప్షన్ఇస్ట్‌గా ప్రతి దరఖాస్తుపై తప్పనిసరిగా పిటిషన్ మేనేజ్‌మెంట్‌లో జనరేట్ చేసిన రిసిప్ట్ ఇవ్వాలని ఎస్పీ సూచించారు. పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో 5ఎస్ విధానాన్ని పాటిస్తూ పరిశుభ్రంగా ఉండేటట్లు అదేవిధంగా ఫైల్స్, క్రమపద్ధతిలో నిర్దేశిత ప్రదేశాల్లో ఉండేటట్లు చూసుకోవాలని సూచించారు. రికార్డ్ రూమ్, రైటర్ రూమ్ తదితర అన్ని విభాగాలు తిరిగి క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సిబ్బందితో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ అంతా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉంటూ విధి నిర్వహణలో క్రమశిక్షణతో ఉండాలని సూచించారు. పోలీస్ శాఖ నూతన టెక్నాలజీ ఉపయోగిస్తున్నదని, దానిపై అధికారులు, సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని సూచించారు. సిబ్బందికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని, ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎస్పీ సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్పీ మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఎస్పీ ఉమామహేశ్వర రావు, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు శ్యామ్ రాజ్, శ్రీకాంత్, నవీన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *