Kalvakuntla Kavitha: మనబలగం – తెలంగాణ బ్యూరో: తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే పూల పండుగ బతుకమ్మ. ఎక్కడైనా దేవతా మూర్తులను పూలతో పూజిస్తారు. కానీ, తెలంగాణలో మాత్రం.. తీరొక్క పువ్వులతో బతుకమ్మలు పేర్చి ఊరూ వాడా ఘనంగా పండుగ నిర్వహించుకోవడం తర తరాలుగా సాంస్కృతిక వారసత్వంగా వస్తోంది. గునుక పూలు, తంగేడు పూలు, బంతి, చామంతి తదితర పూలతో బతుకమ్మలు పేర్చి, గౌరమ్మ తల్లిని కొలవడం సాంప్రదాయంగా వస్తోంది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా.. పూల పండుగ కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అనాదిగా వస్తోంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కేంద్రాలతో పాటు, పట్టణాలు, పల్లెలు బతుకమ్మ పండుగ చేసుకోని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మహిళలు, పిల్లలు నూతన వస్త్రాలు ధరించి, పెద్ద సంఖ్యలో ఊరు చెరువు కట్టలకు చేరుకొని, కులాల వారీగా, వాడకట్టుల వారీగా తాము తెచ్చిన బతుకమ్మలు ఒక దగ్గర పేర్చి, వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతూ సంతోషంగా ఆడుకోవడం రివాజు. తెలంగాణలో చాలా తరాలుగా ఈ సంస్కృతి కొనసాగుతోంది.
కవితక్క జాడేది
ముఖ్యంగా గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం సాకారం అయి, 2014లో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి ‘తెలంగాణ జాగృతి’ ఆధ్వర్యంలో ప్రతి ఏటా బతుకమ్మ పండుగ ఘనంగా నిర్వహించే వారు. తెలంగాణ జాగృతి సంస్థ కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అధినాయకత్వంలో పని చేసేది. ప్రతి సంవత్సరం కేసీఆర్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ నిర్వహణ కోసం నిధులు విడుదల చేసేది. కవిత జిల్లా కేంద్రాల్లో, రాష్ట్రంలోని ముఖ్య పట్టణాల్లో నిర్వహించే బతుకమ్మ పండుగకు హాజరు అయ్యేవారు. మహాలయ అమావాస్య మొదలుకొని సద్దుల బతుకమ్మ వరకు ఎంతో కోలాహలంగా ఉండేవారు. గత ఏడాది డిసెంబర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి చెంది అధికారం నుంచి వైదొలగాల్సి వచ్చింది.
ప్రతిపక్ష పార్టీకే పరిమితం అవడమే కాకుండా, ఈ ఏడాది మేలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం పొంది పరాభవాన్ని ఎదుర్కొన్నారు. అంతే కాకుండా, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ ప్రత్యేక కోర్టులో చార్జ్‌షీట్స్ దాఖలు చేయడంతో కవిత జైలులో కొంత కాలం ఉండాల్సి వచ్చింది. తదుపరి బెయిల్‌పై విడుదల అయ్యారు. ఈ సమయంలో కొన్ని ఆరోగ్య సమస్యలు చుట్టు ముట్టాయని పార్టీలో ప్రచారం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోల్పోవడం, పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెల్చుకోలేకపోవడం, కవిత అరెస్టు, ఆరోగ్య సమస్యలు.. తదితర కారణాలతో ‘తెలంగాణ జాగృతి’ ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహించడం లేదని పలువురు భావిస్తున్నారు. ఏదేమైనా పదేళ్ల పాటు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బతుకమ్మ పండుగ అంటే కవితక్క గుర్తుకు వచ్చేది. ఈ దఫా ఎలాంటి చెప్పుకోదగ్గ కార్యక్రమాలు చేయకపోవడంతో ఆ పార్టీ శ్రేణులు వెలితిగా భావిస్తున్నాయి.