- టార్గెట్ మించి సభ్యత్వం పూర్తి
- కార్యకర్తలకు హ్యాట్సాఫ్ చెప్పిన కేంద్ర మంత్రి బండి సంజయ్
- జిల్లా అధ్యక్షుడి చేతుల మీదుగా క్రియాశీల సభ్యత్వం తీసుకున్న బండి సంజయ్
BJP membership registration: మనబలగం, కరీంనగర్ బ్యూరో: భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదులో కరీంనగర్ జిల్లా అగ్రభాగాన నిలిచింది. పార్టీ నాయకత్వం విధించిన లక్ష్యాన్ని మించి సభ్యులను నమోదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 37 లక్షల 67 వేల సభ్యత్వాన్ని నమోదు చేయించాలని లక్ష్యం విధించగా, నేటి వరకు దాదాపు 30 లక్షల సభ్యత్వం నమోదు చేశారు. అనుకున్న లక్ష్యంలో 75 శాతానికి చేరుకోవడం గమనార్హం. జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్ జిల్లా అగ్రభాగాన నిలిచింది. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 2 లక్షలకుపైగా సభ్యత్వాలు నమోదు చేశారు. సభ్యత్వ నమోదులో భూపాలపల్లి, ములుగు జిల్లాలు అట్టడుగున ఉన్నాయి. ఆయా జిల్లాల్లో 20 వేలలోపే సభ్యత్వం నమోదైంది. అసెంబ్లీ వారీగా చూస్తే కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి 61 వేల మంది సభ్యులను చేర్పించాలని లక్ష్యం విధించగా, 70 వేలకుపైగా సభ్యులను నమోదు చేయించడం విశేషం. పార్లమెంట్ నియోజకవర్గం వారీగా పరిశీలిస్తే…ఇచ్చిన టార్గెట్‌ను అధిగమించిన పార్లమెంటు నియోజకవర్గాల్లో కరీంనగర్ అగ్రభాగాన నిలిచింది. ఇప్పటి వరకు దాదాపు 3 లక్షలకుపైగా సభ్యత్వాన్ని నమోదు చేశారు. కరీంనగర్, హుస్నాబాద్, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో విధించిన లక్ష్యాన్ని మించి సభ్యత్వాన్ని నమోదు చేయడం గమనార్హం.
సభ్యత్వ నమోదులో కరీంనగర్ జిల్లా అగ్రభాగాన నిలిచిన సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పార్టీ కార్యకర్తలను ఆదివారం ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా నాయకులు బండి సంజయ్‌ను కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడి చేతుల మీదుగా బండి సంజయ్ క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకున్నారు. సభ్యత్వ నమోదు వివరాలను అడిగి తెలుసుకున్న బండి సంజయ్ కరీంనగర్ జిల్లా అగ్రభాగాన నిలవడంపై సంతోషం వ్యక్తం చేశారు. అట్లాగే అసెంబ్లీ వారీగా చూస్తే కరీంనగర్, పార్లమెంట్ వారీగా చూస్తే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం సైతం నాయకత్వం విధించిన లక్ష్యాన్ని మించి సభ్యత్వ నమోదు చేయడం హర్షణీయమన్నారు. ‘కార్యకర్తలకు హ్యాట్సాఫ్ చెబుతున్నా. వాళ్ల కృషి ఫలితంగానే సభ్యత్వ నమోదులో నెంబర్ వన్‌గా నిలిచాం. నా తరఫున పార్లమెంటు నియోజకవర్గంలోని కార్యకర్తలందరికీ అభినందనలు’ అని పేర్కొన్నారు.
