ganja: వీర్నపల్లి, ఫిబ్రవరి 17 (మన బలగం): గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని పోలీసులు సోమవారం పట్టుకున్నారు. సిరిసిల్ల రూరల్ సీఐ (ఎల్లారెడ్డిపేట్ సర్కిల్ ఇన్చార్జి) కె.మొగిలి వివరాలు వెల్లడించారు. వీర్నపల్లి మండలానికి చెందిన ముగ్గురు జల్సాల అలవాటుపడి గంజాయి అమ్మకాలు చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తి దగ్గర గంజాయి కొనుగోలు చేసి వారు తాగడంతోపాటు గంజాయి తాగేవారికి అధిక రేటుకు అమ్ముతున్నారు. కొన్ని రోజుల క్రితం నిందితులు గంజాయి కొనుక్కొని వచ్చి కంచర్ల స్టేజ్ వద్ద అమ్మడానికి వచ్చారు. పోలీసులకు అందిన సమాచారం మేరకు వారిని పట్టుకొని వారి దగ్గర నుంచి 110 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. వీరికి గంజాయి అమ్మిన వ్యక్తిని త్వరలో పట్టుకుంటామని సీఐ తెలిపారు. గంజాయి నిందితులను చాకచక్యంగా పట్టుకున్న వీర్నపల్లి ఎస్ఐ ఎల్లాగౌడ్, హెడ్ కానిస్టేబుల్ ఎన్.సత్తయ్య, పీసీ కార్తీక్‌లను అభినందించారు.