Raghunandan Reddy defends Indrakaran Reddy land grab allegations Nirmal: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి భూ కబ్జాలు చేశారంటూ.. పలువురు యువకులు సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడం సరికాదని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ రఘునందన్ రెడ్డి అన్నారు. ఆదివారం నిర్మల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడారు. ఐకే రెడ్డి భూములను ఆక్రమించినట్లు నిరూపిస్తే మీకే పట్టాలు చేసి ఇస్తామని సవాల్ చేశారు. 40 సంవత్సరాలుగా ఐకే రెడ్డి నిర్మల్‌ను అభివృద్ధి పథంలో నడిపించారన్నారు. 1987 నుంచి 2025 వరకు జెడ్పీ చైర్మన్‌గా, ఎమ్మెల్యేగా, ఎంపీగా నిర్మల్‌కు సేవలందించారని తెలియజేశారు. అంతేకాకుండా నిర్మల్‌ను జిల్లాగా మార్చి, రోడ్లు, గుళ్లు, బడులు కట్టించిన చరిత్ర ఆయనకే దక్కుతుందన్నారు.
ఇలాంటి నాయకుడుపై కొంతమంది యువకులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుత ఎమ్మెల్యే ప్రజలకు దూరంగా..హైదరాబాద్‌లో ఉంటున్నారన్నారు. ప్రస్తుతం ప్రజలు కష్టాలను తెలియజేసే పరిస్థితి లేకుండా పోయిందని చెప్పారు. పదవిలో ఉన్న లేకున్నా ఇంద్రకరణ్ రెడ్డి ఏడుపదుల వయసులో కూడా నిర్మల్ ప్రజల కోసం అనునిత్యం పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఐదు రోజుల కింద కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను, వాగులను, చెరువులను, కూలిన ఇండ్లను పరిశీలించి, ప్రజలకు రైతులకు మనోధైర్యాన్ని కల్పించారన్నారు.
వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారని పేర్కొన్నారు. ఇలాంటి నాయకుడిపై ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. ప్రతిపక్ష నాయకులు, కొంతమంది యువకులు సోషల్ మీడియాలో ఐకే రెడ్డిపై చేస్తున్న ఆరోపణలు నిరూపించాలని సవాల్ విసిరారు. ప్రజలను తప్పుడు దోవ పట్టించడమే తప్ప.. వారికి ఇంకేం పనిలేదని మండిపడ్డారు. దమ్ముంటే ఇప్పటికైనా ఆరోపణలు చేయడం మానుకొని, కబ్జాలు చేసి ఉంటే నిరూపించాలని సవాలు విసిరారు. అనవసరంగా ఐకే రెడ్డిపై ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పటికైనా ఐకే రెడ్డిపై ఆరోపణలు మానుకొని, ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఇందులో బన్సపల్లి మాజీ పీఏసీఎస్ చైర్మన్ రమణారెడ్డి, నాయకులు రాంచందర్, సత్యనారాయణ, నాలం శ్రీనివాస్, రాందాస్, శ్రీకాంత్ యాదవ్, అన్వర్, తదితరులు పాల్గొన్నారు.