- సభ ఏర్పాట్లు పర్యవేక్షించిన జువ్వాడి బ్రదర్స్
- సభాస్థలిపి పరిశీలించిన జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్
- జన సమీకరణకు విస్తృత ఏర్పాట్లు
CM Revnath Reddy: నేడు కోరుట్లకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన కోరుట్లకు వస్తున్నారు. ఉదయం 11 గంటలకు పట్టణ శివారులోని పెద్దగుండు వద్ద నిర్మించిన సభాస్థలకి చేరుకుని హాజరయ్యే ప్రజలనుద్దేశించి మాట్లాడుతారని ప్రభుత్వ విప్, కాంగ్రెస్ పార్టీ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్, నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి జీవన్ రెడ్డి తెలిపారు.
ఏర్పాట్ల పరిశీలన
రేవంత్ సభ విజయవంతం చేయడం కోసం కోరుట్ల నియోజకవర్గం, జగిత్యాల నియోజకవర్గం, వేములవా నియోజకవర్గ ప్రజలు హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పార్లమెంటు అభ్యర్థులను గెలిపించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో శ్రమిస్తున్నారన్నారు.
జువ్వాడి బ్రదర్స్ పార్టీ కార్యకర్తల్లో.. నేతల్లో నూతనోత్సాహం నింపుతున్నారు. అదే క్రమంలో ఇతర పార్టీల నుంచి నేతలను, కార్యకర్తలను చేర్పిస్తూ పార్టీ పటిష్టతపై దృష్టిసారించారు. మరోవైపు జిల్లా అధ్యక్షుడు అడ్లూరి రోజు తప్పి రోజు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేపడుతూ కార్యకర్తల్లో ఉత్తేజం నింపుతున్నారు. ఇంకోవైపు అభ్యర్థి జీవన్ రెడ్డి సైతం విస్తృతంగా పర్యటిస్తూ జనాలను ఆకట్టుకునే ప్రచారం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరుట్లకు వచ్చి కార్యకర్తల్లో మరింత ఉత్తేజాన్ని నింపేందుకు ఈ పర్యటన దోహదపడుతుందంటున్నారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి దృష్టిలో పడేందుకు ఎవరికి వారు జన సమీకరణపై విస్తృతమైన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.