Chada Venkata Reddy
Chada Venkata Reddy

Chada Venkata Reddy: ఏకపక్షంగా వ్యవహరిస్తున్న మోడీ సర్కార్: సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకటరెడ్డి

  • ఎన్నికల కమిషన్ నియామకంలో నియంతృత్వ ధోరణి
  • కేసు కోర్టులో ఉండగా ఎలా నియమిస్తారు

Chada Venkata Reddy: కరీంనగర్, మన బలగం: ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ కీలకమైందని, అలాంటి ఎన్నికలు నిర్వహించడానికి ఏ ఒక్క పార్టీకో కొమ్ముకాయకుండా సమర్థవంతంగా ఎన్నికలు జరిగే విధంగా చూడాల్సిన జాతీయ ఎన్నికల కమిషన్ నియామకంపై బీజేపీ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి అన్నారు. ఎన్నికల కమిషన్ నియామకానికి సంబంధించిన కేసు కోర్టులో ఉండగా ఎలాంటి జడ్జిమెంట్ రాకముందే ఎన్నికల కమిషన్‌ను ఏ విధంగా నియమిస్తారని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం కరీంనగర్ జిల్లా సీపీఐ కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారం దీనిపై చర్చించి నిర్ణయించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ప్రధాన న్యాయమూర్తినే సెలక్షన్ కమిటీ నుంచి తీసివేసిన మోడీ ప్రభుత్వం నియామకానికి సంబంధించిన నియమ నిబంధనలను తుంగలో తొక్కుతుందన్నారు. కమిషన్ ఏర్పాటులో ప్రధాని, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన న్యాయమూర్తి ఉండే కమిటీలో చర్చించకుండా ఏకపక్షంగా ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసి జ్ఞానేశ్వర్‌ను నియమించడం బీజేపీక తగదన్నారు.  ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, కోర్టులో కేసు విచారణ జరుగుతూ జడ్జిమెంట్ రాకుండానే కమిషన్ ఏర్పాటు చేయడం మంచి పరిణామం కాదని అన్నారు. మోడీ 11 సంవత్సరాల పరిపాలన చూస్తుంటే ప్రజాస్వామ్య విలువలను మంట కలుపుతూ, నియంతృత్వ వ్యవస్థకు కుట్రలు పన్నుతున్నాడని ఆరోపించారు.

పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు, కాంట్రాక్టర్లు దేశ రాజకీయాల్లోకి రావడం మూలంగా రాజకీయ వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టి పోతుందన్నారు. దేశంలో అనేకమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న నేతలు నేరారోపణలు ఎదుర్కొంటున్నారని, వారిపై విచారణ జరుగుతుందని, ఏళ్ల తరబడి విచారణ జరగకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని తెలిపారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారే మంత్రులుగా ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించడం దురదృష్టకరమన్నారు. 70 ఏళ్ల స్వతంత్ర భారత దేశంలో నేటికీ కూడు, గుడ్డ, నీడ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో పాలకులు విఫలం చెందారని, రాజ్యాంగానికి భిన్నంగా ప్రజల హక్కులు హరించడం దారుణమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనను స్వాగతిస్తున్నామని, ఇదే తరహాలో దేశవ్యాప్తంగా కులగనన జరగాలని సీపీఐ డిమాండ్ చేస్తుందని తెలిపారు. కుల గణన దేశవ్యాప్తంగా జరిగితే వెనుకబడిన వర్గాల వారికి న్యాయం జరుగుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ పార్టీ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా చేయాలనే కుట్రతో ఆనాడు ఇతర పార్టీల ఎమ్మెల్యేలను బీఆర్ఎస్‌లో చేర్చుకొని తప్పు చేశారని మండిపడ్డార. నేడు అదే అంశంపై బీఆర్ఎస్‌కు మాట్లాడే నైతిక హక్కు లేదని, పార్టీలు మారిన వారిపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని అన్నారు. కమ్యూనిస్టులపై కేసీఆర్ మాట్లాడడం అంటే సూర్యునిపై ఉమ్మినట్టేనని, అది తిరిగి మీ మీదకే వస్తుందని, ఇది గుర్తుపెట్టుకొని కేసీఆర్ వ్యవహరించాలని అన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సీపీఐ అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహించిందని, ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన సీపీఐతో పాటు అనేక వామపక్షాలతో కేసీఆర్ కలిసి పనిచేసిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. మునుగోడు ఎన్నికల్లో కమ్యూనిస్టులు లేకుంటే బీఆర్ఎస్ అభ్యర్థి గెలిచేవాడా అని ఆత్మ విమర్శ చేసుకోవాలని, కమ్యూనిస్టులు నిరంతరం ప్రజల పక్షంగా నిలిచి పని చేస్తారని అన్నారు. మేడిగడ్డపై జ్యుడీషియల్ విచారణ జరుగుతున్న నేపథ్యంలో రాజలింగు హత్యపై అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఆ హత్య వెనుక ఎంత పెద్ద వాళ్లు ఉన్నా విడిచిపెట్టకుండా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. గత శాసనసభ, పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో సీపీఐ ఎన్నికల అవగాహన చేసుకుని నేటికీ అది కొనసాగిస్తున్నామని తెలిపారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గెలుపు కోసం కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ సీపీఐ నాయకులతో పాటు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, బామండ్ల పెల్లి యుగేందర్, న్యాలపట్ల రాజు, బోనగిరి మహేందర్, నాయకులు మామిడిపెల్లి హేమంత్ కుమార్, ముత్యాల శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *