AAP Nirmal district president: నిర్మల్, ఆగస్టు 23 (మన బలగం): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని నిర్మల్ జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ హైదర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు ఎరువుల కోసం గంటల తరబడి క్యూ కట్టాల్సిన దుస్థితి ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యమని ఆయన ధ్వజమెత్తారు.
రైతులను పట్టించుకోని ప్రభుత్వాలు
దేశంలోనే అత్యధికంగా వరి పండించే తెలంగాణకు ఎరువుల కేటాయింపులో కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందని సయ్యద్ హైదర్ ప్రశ్నించారు. రాజకీయ విభేదాల కారణంగా రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని అన్నారు. రబీ సీజన్‌కు యూరియా అత్యవసరం అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయడంలో విఫలమైందని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి 8.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కేటాయించినప్పటికీ, ఇప్పటివరకు కేవలం 5.32 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అందినట్లు ఆయన తెలిపారు.
బ్లాక్ మార్కెట్‌పై చర్యలు శూన్యం
ప్రభుత్వ పెద్దల అండతో కొంతమంది బడా వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో యూరియాను అమ్ముతున్నారని, వారిపై చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని సయ్యద్ హైదర్ ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని రైతులకు సకాలంలో యూరియాను అందించాలని, లేకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ రైతుల పక్షాన పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్ సాధిక్, వినోద్, హైమద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.