Godavari Harati: ధర్మపురి, డిసెంబర్ 1 (మన బలగం): పవిత్ర కార్తీక మాసం చివరి రోజును పురస్కరించుకొని ధర్మపురి క్షేత్రంలోని గోదావరి నది వద్ద ఆదివారం నిర్వహించిన మహ హారతి కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యార. గోదావరి వద్ద వేద పండితులు నిర్వహించిన పూజా కార్యక్రమల్లో పాల్గొని గోదావరి నదీమతల్లికి మండల నాయకులు, అధికారులతో కలిసి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా మహిళలకు కార్తీక మాసం సందర్భంగా ప్రభుత్వం నుంచి వచ్చిన తాంబులాలను మహిళలకు పంపిణీ చేశారు. అనంతరం విప్ మాట్లాడుతూ నెల రోజుల నుంచి కార్తీక మాసం సందర్భంగా ధర్మపురి గోదావరి నదీమ తల్లికి హారతి కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలపై గోదావరి నదీమతల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆ లక్ష్మీ నరసింహ స్వామి వారి కృపాకటాక్షాలు రాష్ట్ర ప్రజానీకంపైన ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రానున్న పుష్కరాలు వేద పండితులు, అర్చకుల సూచనల మేరకు అత్యంత వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో దేవాలయ అధికారులు, అర్చకులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.