Road Safety Months: నిర్మల్, జనవరి 23 (మన బలగం): ప్రజలందరూ రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగివుండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. గురువారం స్థానిక ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా ఏర్పాటుచేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని, రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఉచిత కంటి వైద్య శిబిరాన్ని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వాహన చోదకులందరికీ కంటి చూపు అత్యంత కీలకమన్నారు. ఇటువంటి కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి వాహనచోదకులందరికీ కంటి పరీక్షలను నిర్వహించడం ద్వారా దృష్టిలోపాలను గుర్తించి, దానికి అనుగుణంగా చికిత్సలను తీసుకోవడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు అన్నారు. రెండు రోజులపాటు చేపట్టనున్న కంటి వైద్య శిబిరంలో భాగంగా వీలైనంత ఎక్కువ మంది వాహనచోదకులకు కంటి పరీక్షలను నిర్వహించాలన్నారు. అంతకుముందు కార్యాలయంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన రవాణా శాఖ సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.
రోడ్డు ప్రమాదాల బారినపడి, ఇతర అనారోగ్య కారణాల వల్ల ఎంతోమంది సరైన సమయానికి రక్తం దొరకక మృత్యువాత పడుతున్నారని తెలిపారు. ప్రజలందరూ రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించే విధంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి నిర్మల్‌ను రోడ్డు ప్రమాదాల రహిత జిల్లాగా మార్చాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 26 ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, తగిన చర్యలను చేపట్టడం ద్వారా 20 వరకు ప్రమాదకర ప్రాంతాలను ప్రమాద రహిత ప్రదేశాలుగా మార్చినట్లు తెలిపారు. ప్రమాదకర డ్రైవింగ్, హెల్మెట్‌లేని డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. పోలీసు శాఖ సహకారంతో ఎప్పటికప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టాలన్నారు. రోడ్డు భద్రత నియమాలను పాటించని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమానికి వచ్చిన పోశెట్టి అనే వృద్ధుని చేతిలో హెల్మెట్‌ను గమనించిన కలెక్టర్ ఆయనను అభినందించారు. ప్రతి ఒక్కరు పోశెట్టిని ఆదర్శంగా తీసుకొని ద్విచక్ర వాహనాన్ని నడిపే సమయంలో ఎల్లప్పుడూ హెల్మెట్ ధరించాలని సూచించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో అధికారులతో కలిసి కలెక్టర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ప్రాంతీయ రవాణా అధికారి దుర్గాప్రసాద్, సహాయ మోటార్ వెహికల్ ఇన్‌స్పె్క్టర్లు ముర్తాజ అలీ, రానాశ్రీ, అక్షయ్, రజినీకాంత్, డీఎంహెచ్‌వో రాజేందర్, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ కుమార్, నిర్మల్ పట్టణ తహసీల్దార్ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.