Pending salaries: కరీంనగర్, ఫిబ్రవరి 4 (మన బలగం): మూడు నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న ఉపాధిహామీ ఉద్యోగుల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి కొయ్యడ సృజన్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వివిధ స్థాయిల్లో పని చేస్తున్న ఉద్యోగుల పట్ల పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సక్రమంగా ప్రజలకు చేరవేయడంతో పాటు వ్యవసాయ కూలీల కోసం ప్రారంభించిన ఇందిరమ్మ భరోసా పథకం లబ్ధిదారులను ఎంపిక చేయడంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్న సిబ్బంది యొక్క మూడు నెలల వేతనాలు విడుదల చేయాలని అన్నారు. వేతాలు లేక కుటుంబాల పోషణ భారంగా మారి, పిల్లలకు ఫీజులు కట్టలేక, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధిహామీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గతంలో సమ్మె చేసిన సందర్భంగా ఇచ్చిన హామీలను అన్నింటిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పే స్కెల్‌ను అమలు చేయాలని అన్నారు. లేని పక్షంలో సమ్మెకు పోవడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ప్రభుత్వం చొరవ చూపి వెంటనే ఉపాధిహామీ సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని, పెండింగ్ వేతనాలను విడుదల చేయాలని సృజన్ కుమార్ డిమాండ్ చేశారు.