- అసెంబ్లీ ఎన్నికల్లో వద్దన్నారు
- పార్లమెంటు ఎన్నికల్లో భుజానికెత్తుకున్నారు
- రాజేందర్, రఘునందన్, సంజయ్, అరవింద్ ఎంపీగా విజయం
Lok Sabha Election Results 2024: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధిక స్థానాల్లో విజయం సాధించి మూడో సారి అధికారాన్ని చేజిక్కించుకున్నది. ప్రధాని నరేంద్ర మోడీ 400 ప్లస్ సీట్ల కోసం గట్టి ప్రయత్నమే చేసినా 300 మార్కును కూడా దాటలేకపోయింది. అయితే తెలంగాణలో మాత్రం బీజేపీ అనూహ్యంగా పుంజుకున్నది. గతంతో పోల్చితే రెండింతల సీట్లు సాధించింది. గత లోక్‌సభ ఎన్నికల్లో కేవలం నాలుగు సీట్లలో మాత్రమే విజయం సాధించగా ఈ సారి ఎనిమిది స్థానాల్లో విజయఢంకా మోగించింది. అయితే ఎన్నికల హడావుడి ప్రారంభం నుంచి తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ కేంద్ర, రాష్ర్ట లీడర్లు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ ఆశించిన స్థాయిలో కాకున్న బెటర్‌గానే సీట్లు సాధించుకోగలిగింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీ పెద్ద ప్రభావం చూపలేదు. రాష్ర్ట స్థాయిలో పేరున్న లీడర్లు, సిట్టింగ్ ఎంపీలుగా ఉండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన వారూ ఓటమి పాలయ్యారు.
అయితే అనూహ్యంగా పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం అలాంటి వారికి పట్టం కట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో వద్దనుకున్న వారిని ఓటర్లు భుజానికెత్తుకొని పార్లమెంటు(Parliament)లో కూర్చోబెట్టారు. ఓటరు తీర్పును ఎవరూ అంచనా వేయలేరనడానికి ఇదే నిదర్శనం. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, రఘునందన్ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ ప్రస్తుత లోక్‌సభ రిజల్ట్‌లో మాత్రం ఎంపీలుగా విజయం సాధించారు. ఈ నలుగురిని అసెంబ్లీకి కాకుండా ఓటర్లు పార్లమెంటుకు పంపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ దీటుగా ఎదుర్కొంది. ప్రధాని మోడీ చరిష్మాకు తోడు కేంద్రంలో అధికారంలోకి వచ్చే పార్టీని గెలిపిస్తే రాష్ట్ర అభివృద్ధి సాధించడం సాధ్యమని ఓటర్లకు వివరించడంలో సఫలీకృతులయ్యారు. అధికార కాంగ్రెస్ పార్టీని దాటిగా ఎదుర్కొన్నారు.
బండికి జై
పార్లమెంటు ఎన్నికల్లో బండి సంజయ్ కుమార్ (Bandy Sanjay Kumar) రెండో సారి విక్టరీ సాధించారు. రాజకీంగా అనేక ఇబ్బందులు ఎదురైనా ఎదురొడ్డి నిలబడగలిగారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ (Karimnagar) అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో పరాజయాన్ని చవిచూశారు. అయినా ఏమాత్రం వెనకడుగు వేయకుండా నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో రెండు లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో ఎంపీగా ఘన విజయాన్ని నమోదు చేశారు.
నిజామాబాద్‌లో అరవింద్ విక్టరీ
నిజామాబాద్ (Nizamabad) లోక్‌సభ స్థానం నుంచి ధర్మపురి అరవింద్ (Dharmapuri Arvind) విక్టరీ సాధించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల జిల్లా కోరుట్ల అసెంబ్లీ స్థానం నుంచి బరిలో నిలిచారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కల్వకుంట్ల సంజయ్ చేతిలో 10 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న అరవింద్ పార్లమెంటు ఎన్నికల్లో బరిలో నిలిచారు. మోడీ చరిష్మాకు తోడు తన వ్యూహాన్ని అమలు చేసి విజయాన్ని అందుకున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన జీవన్ రెడ్డిపై లక్ష పైచిలుకు ఓట్లతో గెలుపు బావుటా ఎగుర వేశారు.
మెదక్‌లో రఘునందన్ విజయం
మెదక్(Medak) జిల్లా దుబ్బాక అసెంబ్లీ నుంచి పోటీ చేసిన రఘునందన్ ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ చేతిలో పరాజయం పాలయ్యారు. పార్లమెంటు ఎన్నికల్లో అధిష్టానం టికెట్ కేటాయించడంతో ఎంపీగా బరిలో నిలిచారు. న్యాయవాదిగా మంచి పేరున్న రఘునందన్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో కాదన్న ఓటర్లు ఎంపీ ఎన్నికల్లో విజయాన్ని కట్టబెట్టారు. ఇటు బీఆర్ఎస్, అటు కాంగ్రెస్ అభ్యర్థులను దీటుగా ఎదుర్కొన్నారు. మెదక్ స్థానంలో పాతికేళ్ల తరువాత బీజేపీ పాగా వేసింది.
మల్కాజిగిరి ఈటలదే
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఈటల రాజేందర్ ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేతిలో పరాజయం చవిచూశారు. దీంతో ఈటల రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమే అన్న టాక్ వినిపించింది. రాజకీయంగా అనుభవం గడించిన ఈటల పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటారు. మినీ ఇండియాగా చెప్పుకునే మల్కాజిగిరి సెగ్మెంట్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఘన విజయాన్ని అందుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డిపై 3.8 లక్షల ఓట్ల భారీ మెజార్టీతో విక్టరీ కొట్టారు.