Minister Seethakka: నిర్మల్, జనవరి 31 (మన బలగం): ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నాగోబా జాతర ఘనంగా జరుగుతోంది. జాతరకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఇన్‌చార్జి ఆత్రం సుగుణక్క సంప్రదాయ చీరకట్టుతో వచ్చారు. ఆదివాసీ గిరిజన మహిళలు ధరించే గొలుసు, చేతులకు, మెడకు కడియాలు వేసుకున్నారు. ఈ సందర్భంగా నాగోబా ఆలయంలో మంత్రి సీతక్క, ఆత్రం సుగుణక్క, పలువురు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మెస్రం వంశస్తుల పెద్దలు వారికి నాగోబా దేవత జ్ఞాపికను అందజేసి ప్రసాదాలను అందించారు. అనంతరం దర్బార్‌లో పాల్గొన్న మంత్రి సీతక్క గోండి భాషలో మాట్లాడారు. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవని, వాటిని కాపాడుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే రెండుసార్లు నాగోబాను దర్శించుకున్నారని, ఆలయ అభివృద్ధికి, ఆదివాసీల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.