Khanapur MLA Vedma Bojju Patel: నిర్మల్, జనవరి 31 (మన బలగం): ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో కొలువు దిరిన నాగోబాకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క, ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్బార్‌లో ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వేడ్మ బొజ్జు పటేల్ పాల్గొని మాట్లాడారు. ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలు గొప్పవని అన్నారు. పుష్యమాసం ఆదివాసులకు అత్యంత పవిత్రమైనదని, అందరూ సంప్రదాయ తెల్ల దుస్తులు ధరించి, ఎంతో నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో దేవతలను పూజిస్తారన్నారు. మెస్రం వంశీయులు కేస్లాపూర్ నుంచి మొదలుకొని జన్నారం మండలం హస్తినమడుగు వరకు క్రమశిక్షణతో తెల్లదుస్తులు ధరించి, కాలినడకన వెళ్లి పవిత్ర గంగాజల సేకరణ చేయడం తరతరాలుగా వస్తున్న ఆచారామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నాగోబా ఆలయ అభివృద్ధికి కోట్ల రూపాయలు మంజూరు చేసిందన్నారు. నాగోబా జాతర నిర్వహణకు ప్రభుత్వం పకడ్బందీగా ఏర్పాటు చేసిందన్నారు. ప్రజలపై నాగోబా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించారు. పాడి పంటలు బాగా పండాలని, ప్రపంచమంతా సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండె విఠల్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ సత్తు మల్లేష్, మాజీ ఎంపీ సోయం బాపురావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి ఆత్రం సుగుణ, ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి, మెస్రం వంశీయులు, ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.