- క్వింటాల్ కందులకు రూ.7550 మద్దతు ధర
- కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పన
- అధికారులతో సమీక్ష నిర్వహించిన అదనపు కలెక్టర్
Purchase of Kandi crop: మనబలగం, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో వచ్చే కందుల పంటను మద్దతు ధరపై కొనుగోలు చేసేందుకు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో కందుల కొనుగోలుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో కందుల కొనుగోలు యాక్షన్ ప్లాన్‌ను అధికారులు అదనపు కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ మాట్లాడుతూ, జిల్లాలో 1129 ఎకరాల 28 గుంటల భూమిలో కందుల సాగు జరిగిందని, ప్రస్తుత వానాకాలం 6 వేల 211 క్వింటాళ్ల దిగుబడి వచ్చే అవకాశం ఉందని, మార్క్‌ఫెడ్ ద్వారా రైతులకు మద్దతు ధర వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. వానాకాలం 2024-25 సీజన్‌లో ప్రతి క్వింటాల్ కందుల పంటకు 7550 రూపాయల మద్దతు ధర తప్పనిసరిగా అందించాలని అన్నారు. కందుల పంట కొనుగోలుకు వ్యవసాయ సహకార సంఘాలు, డీసీఎంఎస్‌లలో అనువైన కేంద్రాలను గుర్తించాలని సహకార అధికారికి సూచించారు. కందుల పంటను కొనుగోలు కేంద్రాల నుంచి సమీపంలో ఉండే స్టోరేజ్ పాయింట్‌కు తరలించేందుకు వీలుగా రవాణా ఏర్పాట్లు చేసుకోవాలని, మార్క్‌ఫెడ్ వద్ద అవసరమైన మేర గన్ని బ్యాగులు, వెయింగ్ యంత్రాలు, తేమ యంత్రాలు ఇతర సామగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో వ్యవసాయ మార్కెట్ యార్డులు, ఎఫ్.సి.ఐ గోదాములు, ఇతర గోదాముల వద్ద అందుబాటులో ఉన్న స్థలాన్ని పరిశీలించి కందుల స్టోరేజ్ కోసం ఎంపిక చేయాలని, కందులు కొనుగోలు అంశంలో సిబ్బందికి అవసరమైన శిక్షణ అందించాలని సూచించారు. కందులు కొనుగోలు వద్ద హమాలీల కొరత రాకుండా జాగ్రత్త వహించాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెఫెడ్ అధికారి హాబీబ్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జలిబేగం, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వసంత లక్ష్మి, శాఖ మేనేజర్ రజిత, వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యదర్శులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.