కలెక్టర్‌ను కోరిన కౌన్సిలర్ జయశ్రీ
Jagtial Municipal: జగిత్యాల, అక్టోబర్ 30 (మన బలగం): జగిత్యాల మున్సిపల్ పరిధిలో చేపట్టే అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించిన నిధుల కేటాయింపుల్లో అనేక వ్యత్యాసాలు ఉన్నాయని, ఇలా ప్రజాధనం దుర్వినియోగం అవుతోందని, ఉన్నత స్థాయి అధికారితో విచారణ జరిపించాలని 35వ వార్డు ఇండిపెండెంట్ కౌన్సిలర్ అనుమల్ల జయశ్రీ జగిత్యాల జిల్లా కలెక్టర్‌ను కోరారు. బుధవారం జగిత్యాల మున్సిపల్ సాధారణ సర్వసభ్య సమావేశం జరుగగా అనంతరం జయశ్రీ ఒక ప్రకటన విడుదల చేశారు. మున్సిపల్ ఎజెండాలోని ఒకటో అంశంలో కమిషనర్ కారు అద్దె కింద 32వేల 340 రూపాయలు చెల్లింపులు చేసినట్లు పేర్కొన్నారని, కానీ కమిషనర్ తన స్వంత కారును వాడుకొని మున్సిపల్ ద్వారా డీజిల్ పోసుకొని, డ్రైవర్‌ను వాడుకొన్నారని జయశ్రీ పేర్కొన్నారు. కానీ ఈ బిల్లు కాంట్రాక్టర్‌కు చెల్లించినట్లు పేర్కొనడం అనుమానాలకు తావిస్తోందని పేర్కొన్నారు. 15వ అంశంగా ఏజెండాలో పెట్టిన డీజిల్ ఖర్చు రూ.10 లక్షల 47 వేల 189గా పేర్కొన్నారని, మున్సిపల్ వాహనాల్లో ఎక్కువ వాహనాలు రిపేర్లో ఉండగా ఇంత ఖర్చు ఎలా జరిగిందో విచారణ చేయించాలని కోరారు.
2019 డిసెంబర్ నాటికి మున్సిపల్‌లో 215 మంది కార్మికులు శానిటేషన్ విభాగంలో పనిచేస్తున్నారని, సిబ్బంది సరిపోకపోవడంతో అప్పటి కలెక్టర్ రవి మరో 30 మందిని కొత్తగా తీసుకోవడానికి అనుమతులు ఇచ్చారన్నారు. కానీ సెప్టెంబర్ వరకు 256 మంది పనిచేస్తున్నారని, 11 మంది కార్మికులు అదనంగా చేరారని కౌన్సిల్, కలెక్టర్ అనుమతులు లేకుండా వీరిని నియమించి ప్రజాధనం దుర్వినియోగం చేశారని జయశ్రీ పేర్కొన్నారు. పూర్తిస్థాయి శానిటరీ ఇన్‌స్పెక్టర్ విధుల్లోకి చేరినా బాధ్యతలు ఇవ్వకుండా ఔట్ సోర్సింగ్, సీనియర్ అసిస్టెంట్ ఉద్యోగికి బాధ్యతలు అప్పగించగా నిధుల దుర్వినియోగానికి ఆస్కారం ఉందని జయశ్రీ పేర్కొన్నారు. అలాగే కమిషనర్ల మౌఖిక ఆదేశాలతో జేసీబీ, బ్లేడ్ ట్రాక్టర్, టిప్పర్ల పంక్చర్ల బిల్లు 43 వేల 2 వందల రూపాయలుగా ఎజెండాలో చేర్చారని పేర్కొన్నారు. కానీ గత కమిషనర్లు అనీల్, సమ్మయ్య వచ్చి రాత పూర్వకంగా ఇస్తేనే ఈ బిల్లు పాస్ చేయాలని, నిధుల దుర్వినియోగం జరిగినట్లు కనిపిస్తున్న అంశాలన్నింటిపై ఉన్నత స్థాయి అధికారితో విచారణ జరిపించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కలెక్టర్‌ను కౌన్సిలర్ అనుమల్ల జయశ్రీ కోరారు.